యాదాద్రి : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యాదాద్రిలో భక్తజనుల సందడి నెలకొంది. ఆదివారం, సోమవారం సెలవు దినాలు కావడంతో శ్రీ లక్ష్మీన రసింహస్వామి వారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆదివారం శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం భక్తులు కుటుంభ సభ్యులు, పిల్లాపాపలతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనంతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. భక్తుల రధ్దీ ఎక్కువగా ఉండటంతో ధర్మదర్శనం 3 గంటలకు పైగ పట్టగా,
వీఐపీ దర్శనం 1 గంటలకు పైగా పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు, దర్శన క్యూలైన్లు, వ్రత మండపం, ప్రసాద విక్రయం, పుష్కరిణి తదితర ప్రాంతాలలో భక్తుల సందడి నెలకొంది. కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత శ్రీరామాలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.
ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా అదివారం రూ. 45,47,824 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.16,49,550, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,72,400, బ్రేక్ దర్శనం ద్వారా రూ.5,00,400, వీఐపీ దర్శనం ద్వారా రూ.5,25,000, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.7,50,000, వ్రతపూజలతో రూ. 1,14,400 తో పాటు తదితర శాఖలు, పాతగుట్ట ఆలయం నుంచి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.