Monday, December 23, 2024

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు వరుస సెలవులు కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనంతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత శ్రీరామాలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.

ఆలయంలో ఘనంగా ఏకాదశి లక్ష పుష్పార్చన..
శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవార్లకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి అలంకరించిన రంగురంగుల పరిమళాల పుష్పాలతో వైభవంగా లక్ష పుష్పార్చన పూజను అర్చకులు నిర్వహించారు. శ్రీవారి పుష్పార్చనలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ. 29,33,172 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.9,84,940, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,54,200, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,45,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.3,00,000, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.4,50,000తో పాటు తదితర శాఖలు, పాతగుట్ట ఆలయం నుంచి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

లక్ష్మీనరసింహుడి సేవలో దేవాదాయశాఖ కమిషనర్..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దేవాదాయశాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

స్వామివారి వెండి కలశాల చెక్కు అందజేత..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ఐదు వెండి కలశాలకు చెక్కును భక్తుడు అందజేశాడు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తుడు ఆలయ ఈవో గీతకు చెక్కును అందజేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News