పిల్లల కోసం సిఆర్‌పిఎఫ్ పాఠశాలలు
పూర్వపు నక్సల్ కోటల్లో ఏర్పాటు
ఛత్తీస్‌గఢ్‌లో ఆసక్తికర పరిణామం
సుక్మా : ఒకనాడు నక్సల్స్‌కు పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని నాలుగు గ్రామాల్లో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సిఆర్‌పిఎఫ్) చొరవ పుణ్యమా అని అక్కడ తుపాకుల శబ్దం బదులు పాఠశాల గంటలు గణగణమని మోగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్ వ్యతిరేక కార్యక్రమాలో నిమగ్నమైన సిఆర్‌పిఎఫ్ నాలుగు గ్రామాల్లో ప్రాథమిక పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసింది. విద్యను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకురావడం, నిషిద్ధ సాయుధ ఉద్యమానికి స్థానికులను దూరం చేయడం లక్షంగా సిఆర్‌పిఎఫ్ ఈ చర్య తీసుకున్నది. ‘సిఆర్‌పిఎఫ్ గురుకుల్’ పేరిట పాఠశాలలను దులేడ్, ముక్రాజ్‌కొండ, టెకల్‌గుడియం, పువర్తి గ్రామాల్లో ఏర్పాటు చేయడమైంది. నిరుడు జనవరిలో అక్కడ పోలీస్ శిబిరాలను ఏర్పాటు చేసేంత వరకు వాటిని నక్సలైట్లకు పెట్టనికోటలుగా పరిగణించారు.
గతంలో టెకల్‌గుడియంలో భద్రత సిబ్బందిపై ప్రాణాంతక దాడి జరగగా, బస్తర్ ప్రాంతంలో భద్రత దళాలపై వివిధ కిరాతక దాడులకు సూత్రధారిగా విశ్వసిస్తున్న నక్సలైట్ నేత హిడ్మా స్వస్థలం పువర్తి. ఒకప్పుడు ‘లాల్ సలామ్’ నినాదాలు, తూటాల శబ్దాలు ప్రతిధ్వనించిన ప్రదేశాల్లో ఇప్పుడు పాఠశాలల గంటల మోతలు, పిల్లల సంభాషణలు వినవచ్చునని సిఆర్‌పిఎఫ్ (సుక్మా రేంజ్) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) ఆనంద్ సింగ్ రాజ్‌పురోహిత్ ఫోన్‌లో ‘పిటిఐ’తో చెప్పారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒకనాడు నక్సలైట్ల ఆధిపత్యం సాగిందని, కానీ నిరుడు జనవరి ఫిబ్రవరి కాలంలో భద్రత శిబిరాలు ఏర్పాటు చేసిన దరిమిలా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చోటు చేసుకోసాగిందని ఆయన తెలిపారు. 2021 ఏప్రిల్ 3న టెకల్‌గుడియం ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రత సిబ్బంది హతులయ్యారు. నిరుడు జనవరి 30న టెకల్‌గుడియంలో ఒక పోలీస్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు నక్సలైట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది హతులు కాగా, మరి 15 మంది గాయపడ్డారు.
‘ఆ గ్రామాల్లో పాఠశాలలు లేవు. ప్రాథమిక పాఠశాల పిల్లల కోసం వాటిని తెరవాలని నిశ్చయించాం’ అని డిఐజి తెలిపారు. పువర్తి, టెకల్‌గుడియం శిబిరాల్లో సిఆర్‌పిఎఫ్ 150వ బెటాలియన్‌ను, ముక్రాజ్‌కొండ, దులేడ్ శిబిరాల్లో రెండవ బెటాలియన్ ఏర్పాటయ్యాయి. ఆ నాలుగు ప్రదేశాల్లో శిబిరాల పక్కనే పాఠశాలల కోసం టిన్‌షెడ్ పైకప్పుతో ఒక గది ఏర్పాటు చేసినట్లు, 50 మంది నుంచి 60 మంది వరకు విద్యార్థుల కోసం ఒక్కొక్క పాఠశాలకు ఒక పౌర టీచర్‌ను నియోగించినట్లు డిఐజి వివరించారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సమకూర్చిన పౌర కార్యాచరణ కార్యక్రమం కింద ఒక నిధి ద్వారా టీచర్లకు గౌరవ భృతి చెల్లిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం ఆ పాఠశాలల్లో ఐదవ తరగతి వరకు క్లాసులు ఉన్నట్లు, ఆదిలో ఒకటి, రెండు తరగతుల కోసం విద్యార్థులను చేర్చుకున్నట్లు, ఆ తరువాత 12వ తరగతి వరకు ఆ సదుపాయాలు పెంచనున్నట్లు డిఐజి చెప్పారు. యూనిఫామ్‌లు, పుస్తకాలు, బ్యాగులు, షూలు, సాక్స్ సమకూర్చడానికి ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు, ఆ ప్రాంగణాల్లో పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కోసం వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి వివిధ క్రీడలను ప్రవేశపెడుతున్నట్లు రాజ్‌పురోహిత్ తెలియజేశారు. పాఠశాల గోడలపై రకరకాల చార్ట్‌లు, బోర్డులు అమర్చినట్లు. ప్రతి చోట ఒక ప్రొజెక్టర్‌తో ఒక పెద్ద టెలివిజన్ సెట్ కూడా ఏర్పాటు చేయదలచినట్లు ఆయన చెప్పారు.
గురుకుల్ ప్రాంగణాల్లో భవనాలు, మరుగుదొడ్లు, హ్యాండ్ పంపులు వంటి మౌలిక వసతుల కల్పన కోసం, ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరి మధ్యాహ్న భోజన సదుపాయం ప్రారంభించడానికి స్థానిక అధికార యంత్రాంగం సహాయం కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఆ పాఠశాలల్లో పిల్లలను చేర్చుకోవడంలో సిఆర్‌పిఎఫ్ ఏదైనా సమస్య ఎదుర్కొన్నదా అని ప్రశ్నించినప్పుడు గ్రామస్థులు ఐచ్ఛికంగా తమ పిల్లలను పంపుతున్నారని డిఐజి సమాధానం ఇచ్చారు. అయితే, టీచర్లను నియమించుకోవడంలో ఒక సమస్య ఎదురైందని, నిరుడు సెప్టెంబర్‌లో సుక్మాలోని జగర్‌గుండా ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ‘శిక్షా దూత్’ (తాత్కాలిక పర్యాటక ఉపాధ్యాయుడు)గా పని చేసిన ఒక వ్యక్తిని నక్సల్స్ హతమార్చడం అందుకు కారణమని, స్థానికులు బెదరిపోయారని డిఐజి తెలిపారు.