Monday, November 25, 2024

కాల్పులకు దారితీసిన భోజనం గొడవ

- Advertisement -
- Advertisement -

CRPF Umesh Chandra killed

సిఆర్‌పిఎఫ్ ఉమేశ్‌చంద్ర మృతి
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ములుగు వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ఘటన

మనతెలంగాణ/హైదరాబాద్(ములుగు): ములుగు జిల్లాలో వెంకటాపురం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం నాడు సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ఎస్‌ఐ ఉమేశ్‌చంద్రపై ఎకె 47 గన్‌తో కాల్పులు జరిపి అనంతరం తనకు తాను కాల్చుకున్న ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ జరిపిన మూడు రౌండ్ల కాల్పుల్లో బీహార్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్(39)వ బెటాలియన్ ఎస్‌ఐ ఉమేశ్‌చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా తనకు తాను కాల్చుకున్న కానిస్టేబుల్ స్టీఫెన్ తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏటూరినాగారం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారికు చెందిన కానిస్టేబుల్ స్టీఫెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో సిఆర్‌పిఎఫ్ 39 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు సిఆర్‌పిఎఫ్ ఎస్‌ఐ ఉమేశ్ చంద్ర, కానిస్టేబుల్ స్టీఫెన్‌ల మధ్య భోజనం తయారీ విషయంలో గొడవ చోటుచేసుకుంది.

అదేవిధంగా సెంట్రీ డ్యూటీ ఎప్పుడూ తనకే వేస్తావా అంటూ ఎస్‌ఐ ఉమేశ్‌చంద్రతో కానిస్టేబుల్ స్టీఫెన్ గొడవకు దిగాడు. ఈ గొడవ పెరిగి పెద్దది కావడంతో క్షణికావేశంలో ఎస్‌ఐ ఉమేశ్ చంద్రపై సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్టీఫెన్ ఛాతిలో రెండు బుల్లెట్లు, పొట్టలో ఒక బులెట్ మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల ఘటనలో బిహార్‌కు చెందిన ఉమేశ్ చంద్ర తల, ఛాతీ భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో మృతిచెందాడు. అనంతరం భయాందోళనకు గురైన స్టీఫెన్ తుపాకీతో తనను తాను గవద, తలపై కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్టీఫెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అతడిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ లేదా హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు డ్యూటీ విషయంలో గొడవే కాల్పులకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నిత్యం ఒకరికే సెంట్రీ డ్యూటీ వేయడంతో సహనం కోల్పోయిన స్టీఫెన్ కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. కాగా తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దులోని వెంకటాపురం పిఎస్ పరిధిలో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 39వ బెటాలియన్ గత కొంత కాలంగా పనిచేస్తుందని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News