Wednesday, January 22, 2025

రైలు రాంగ్‌రూట్‌కు వెళ్లేలా సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిషాలో కోరమాండల్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ తొలిసారి నివేదిక వెలువరించింది. కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నిర్వహించిన దర్యాప్తు క్రమంలో వెలువడ్డ నివేదికను ఇప్పుడు తొలిసారి విడుదల చేస్తున్నట్లు రాజ్యసభలో శుక్రవారం రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. పలు తప్పిదాలతో ఈ దుర్ఘటన జరిగిందని ఈ సిఆర్‌ఎస్ నివేదికలో పేర్కొన్నారు. రాజ్యసభలో సభ్యులు డాక్టర్ జాన్ బ్రిట్టస్ ఈ ప్రమాదంపై లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వశాఖ ఈ నివేదికను వెల్లడించింది. పలు తప్పిదాలు ప్రత్యేకించి సిగ్నలింగ్ వ్యవస్థలో చోటుచేసుకన్నాయి. నార్త్ సిగ్నల్ గూమ్తి స్టేషన్‌లోని సిగ్నలింగ్ సర్కూట్ మార్పిడి దశలో పొరపాట్లు జరిగాయి. అదే విధంగా ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బేరియర్ మార్పిడి కోసం జరిగిన సిగ్నలింగ్ తప్పిదాలు ఘోర ప్రమాదానికి దారితీశాయని నివేదికలో తెలిపారు. ఈ ప్రమాదంలో 293 మంది మృతి చెందారు, వేయి మందికి పైగా గాయపడ్డారు.

ఇప్పటికీ 41 మంది మృతులను గుర్తించలేదని కూడా ప్రభుత్వం అంగీకరించింది. అన్నింటికి మించి స్టేషన్‌లోని లెవల్ క్రాసింగ్ గేట్ నెంబరు 94 వద్ద మరమ్మత్తు పనుల దశలో సిబ్బంది నిర్లక్షం, అధికారుల నుంచి సరైన ఆదేశాలు అందకపోవడం ఘటనకు దారితీసింది. రైలు వెళ్లకూడని లైన్‌లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల రైలు వెళ్లి గూడ్స్‌ను వేగంగా ఢీకొంది. జరిగిన లోపాలన్ని కూడా సంబంధిత అధికారుల ఘోర తప్పిదాలు, నిర్లక్షం కారణంగా తలెత్తినవే అని రైల్వే మంత్రి ఈ నివేదికను ఉటంకిస్తూ ప్రస్తావించారు. ఇటువంటి సిగ్నల్ వైఫల్యాలు మూడేళ్లుగా జరుగుతున్నాయని, వీటి వివరాలు పొందుపర్చలేదని సభ్యుడు పదేపదే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిని దాటవేసింది. అయితే ఇప్పటి ఘటనలో వైఫల్యాలు తీవ్రమైనవని, ఇంతకు ముందటి ప్రమాదాలతో పోలిస్తే బాలాసోర్ వంటి దుర్ఘటనలో ప్రదర్శితమైన వైఫల్యాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది.

రైలు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ ముగ్గురు రైల్వే ఉద్యోగులను ఈ నెల ఆరంభంలో అరెస్టు చేసింది. అరుణ్‌కుమార్ మహంత, మెహమ్మద్ అమీర్ ఖాన్, పప్పూ కుమార్‌లను అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరంతో సమానం కానీ హోమిసైడ్ అభియోగాలు మోపారు. సాక్షాలను నాశనం చేశారనే అభియోగాలు కూడా నమోదు అయ్యాయి. నిందితులు ఇప్పుడు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీరి సిబిఐ రిమాండ్ ఈ నెల 15తో ముగిశాయి. వీరిని సిబిఐ తిరిగి ఈ నెల 27న విచారిస్తుంది. ఘటనపై ఇప్పటికీ దర్యాప్తు సాగుతోంది
బిజెపి ప్రభుత్వ వైఫల్య పరాకాష్ట ః కాంగ్రెస్
రైల్వే సేఫ్టీ కమిషన్ (సిఆర్‌ఎస్) నివేదికతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేల భద్రత పట్ల ఎంతటి నిర్లక్షం వహిస్తోందనేది స్పష్టం అయిందని కాంగ్రెస్ విమర్శించింది. భద్రతా ప్రమాణాలపై కేంద్రం రాజీపడింది. ఇప్పటి ఘటనలో జరిగిన మానవ తప్పిదం పెద్ద ఎత్తున జరిగిన నిర్వహణ వ్యవస్థ, రాజకీయ నాయకత్వ వైఫల్యాలను చాటిచెప్పిందని పార్టీ మండిపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News