Saturday, March 22, 2025

మళ్లీ భారత్ కు చమురు సంక్షోభం!

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాలో ఎలాంటి సంఘర్షణలు ఎదురైనా భారతీయ వాణిజ్య రంగానికి సంక్షోభం తప్పదు. చమురు, సహజ వాయువు, ఎరువులు, తదితర ముఖ్య అవసరాలు సరిగ్గా సరఫరా కాక, వాణిజ్యంలోనే కాదు, ప్రజల జీవన విధానంలో కూడా ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా చమురు సంక్షోభం సంభవిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ఒక్కసారిగా పెరిగిపోతుంది. మనకు ఎఉ్కవగా చమురును, గ్యాస్‌ను సరఫరా చేసేది రష్యా, ఇరాన్ దేశాలే. ఆయా దేశాల నుంచి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే మన దేశం భారీగా అంతర్జాతీయ మార్కెట్‌కు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా నుంచి మనదేశానికి ముడి చమురు దిగుమతులు రోజువారీ సరాసరిన (మిలియన్ పెర్ డే) 1.41 మిలియన్ బ్యారెళ్ల వంతున తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం.

గత సంవత్సరం జనవరి నాటికి రోజువారీ 1.49 మిలియన్ బ్యారెళ్ల వంతున తగ్గిపోగా అంతకన్నా ఇప్పుడు తగ్గడం గమనార్హం. కార్గో ట్రాకింగ్ ఏజెన్సీ వోర్టెక్స్ వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజువారీ మొత్తం 4.77 మిలియన్ బ్యారెళ్లుగా చమురు దిగుమతులు జరిగాయి. జనవరిలో రోజువారీ మొత్తం 4.76 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతులు కాగా పెద్దగా మార్పు లేదు. అయితే ఈ మార్చి, ఏప్రిల్ నెలల్లో మరింతగా చమురు దిగుమతులు క్షీణిస్తాయని వోర్టెక్స్ చెబుతోంది. దీనికి కారణం అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారెస్ అసెట్స్ కంట్రోల్ (ఒఎఫ్‌ఎసి) జనవరి 10 న విధించిన ఆంక్షలే.

అయితే ఈ లోటును పశ్చిమాసియా దేశాలు భర్తీ చేస్తాయని ఎపిఎసి అనాలిసిస్ వోర్టెక్స్ అధినేత ఇవాన్ మేథ్యూ వెల్లడించారు. రష్యా చమురు ఉత్పత్తిదారులైన గాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సర్గుట్ నెఫ్ట్ గ్యాస్‌లతో పాటు దాదాపు 180 ట్యాంకర్లపై తాజాగా జనవరి 10న అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాకు రెవెన్యూ రాకుండా అడ్డుకోవడమే దీని వెనుక ఉన్న ఆంతర్యం. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికే రష్యా ఈ ఆదాయాన్ని ఖర్చు పెడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఫలితంగానే రష్యా చమురు కార్గో నౌకలు ఫిబ్రవరి 27 నాటికి అమెరికా ఆంక్షల సుడిలో చిక్కుకోవలసి వచ్చింది.

2024 మొదటి ఏడు మాసాలు (జనవరి జులై) ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్ దేశాలకు భారత్ నుంచి వాణిజ్యంలో సంఘర్షణలు తప్పలేదు. భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు 63.3 శాతం వరకు ఎగుమతులు పతనమయ్యాయి. దీని విలువ 1.3 బిలియన్ డాలర్లు. ఆర్గానిక్ కెమికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, డైమండ్స్, ఎగుమతులకు గండి పడిందని వాణిజ్య విభాగం వెల్లడించింది. అలాగే జోర్డాన్‌కు ఎగుమతుల్లో 38 శాతం అంటే 638 మిలియన్ డాలర్ల వరకు, లెబనాన్‌కు 7% అంటే 198 మిలియన్ డాలర్ల వరకు ఎగుమతులు పతనమై భారత్‌కు నష్టాలు సంభవించాయి.

2024 వరకు అంతకు ముందు ఏడేళ్లుగా ఏటా 3% వంతున ముడిచమురు ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తోంది. ఉత్పత్తిలో తగ్గుదల ఉంటున్నా వినియోగం పెరుగుతుండడంతో భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది. 2017 నుంచి 2024 వరకు 86 నుంచి 89 శాతం వరకు దిగుమతులపైనే దేశం ఆధారపడవలసి వచ్చింది. భారత ఇంధన వినియోగ చిత్ర 2024 ఆర్థిక సంవత్సర నివేదికలో ఇదో భాగం. దేశం ఇంధనాన్ని సేకరించడం, ఉత్పత్తి, వినియోగం తాలూకు ఆమూలాగ్ర డేటాను ఈ నివేదిక అందిస్తోంది. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నేతృత్వంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బిఇఇ)ఈ నివేదికను రూపొందించింది.

2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సరఫరా అయిన ఇంధనం 910 మిలియన్ టన్నులు కాగా, ఇందులో బొగ్గు నుంచి 60%, చమురు నుంచి 28%, గ్యాస్ నుంచి 7%, శిలాజేతర వనరుల నుంచి 5% సరఫరా అయింది. స్వదేశీ చమురు ఉత్పత్తి 2017 ఆర్థిక సంవత్సరంలో 36 మిలియన్ టన్నులు కాగా, 2024 నాటికి 29.4 మిలియన్ టన్నులకు తగ్గిపోయింది. వార్షిక రేటు 3% వరకు తగ్గుతూ వస్తోంది. ఈ తగ్గుదలకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 2019లో హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ లైసెన్సింగ్ (హెచ్‌ఇఎల్‌పి) వంటి ప్రక్రియను అమలుచేసే చర్యలను తీసుకుంది.

ఎంపికైన చమురు క్షేత్రాల్లో తగిన సాంకేతిక విధానాలు అమలు చేసి చమురు ఉత్పత్తిని సాధించడమే ఈ విధానం లక్షం. చిన్న, మధ్యతరహా స్థాయిలో చమురు పరిశోధనలను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ద్వారా ఆయా సంస్థలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ నిర్వహణలోని ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా సంస్థలు క్రమంగా 65 శాతం, 11 శాతం వరకు 20232024 సంవత్సరంలో చమురును అందించగలిగాయి. మిగతా 24 శాతం ముడిచమురు ఉత్పత్తి ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ (పిఎస్‌సి) లేదా రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ (ఆర్‌ఎస్‌సి) ద్వారా లభించింది. 2024 ఏప్రిల్ 1 నాటికి సమతుల్యతలో తిరిగి పొందగలిగిన చమురు నిల్వలు 671.4 మిలియన్ టన్నులుగా భారత్ అంచనా వేసింది. అంతకు ముందు సంవత్సరం నాటి 669.47 మిలియన్ టన్నుల నిల్వలతో పోల్చుకుంటే 0.3 శాతం ఎక్కువ.

స్వదేశీ చమురు ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చమురు దిగుమతులపై ఆధారపడడం మరింత ఎక్కువ అవుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు దిగుమతి దారైన భారత్ 2024లో 234 మిలియన్ టన్నుల చమురును సేకరించుకోగలిగింది. సరఫరా కావలసి చమురులో 86% 2017లోను, 89% 2024 లోనూ దిగుమతి చేసుకోవలసి వచ్చింది. కొవిడ్ మహమ్మారి సమయంలో చమురు దిగుమతులు తాత్కాలికంగా 202122 లో తగ్గాయి. భారీ స్థాయిలో దిగుమతి చేసుకున్నామంటే రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం భారీగా పెరుగుతున్నట్టే భావించక తప్పదు. 2024 ఏప్రిల్ 1నాటికి ఏడాదికి 256.8 మిలియన్ టన్నుల చమురును రిఫైనింగ్ చేసే సామర్థం భారత్‌కు ఉందని తేలింది. దీంతో ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తరువాత నాలుగో రిఫైనర్‌గా భారత్ నిలుస్తోంది.

-కె. యాదగిరి రెడ్డి-                                                                                                                9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News