రెండు నెలల గరిష్ఠానికి చేరిన ధర
ట్రేడింగ్‌లో 117 డాలర్లు దాటిన బ్యారెల్ రేటు
న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి. శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 118 డాలర్లు దాటింది. ట్రేడింగ్ సమయంలో బ్యారెల్ రేటు 117.30 డాలర్లుగా ఉంది. రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 117 డాలర్లు దాటడం మార్చి 28 తర్వాత ఇప్పుడే. అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 2008 తర్వాత మొదటిసారిగా బ్యారెల్‌కు 139 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రష్యా నుండి ముడి చమురు దిగుమతిని నిషేధించాలనే డిమాండ్, అలాగే చైనాలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు వంటి పరిణామాలు క్రూడ్ ఆయిల్‌పై ప్రభావం చూపాయి. చైనాలో లాక్‌డౌన్ సడలిస్తే అది ముడి చమురు డిమాండ్‌ను పెంచుతుంది. సరఫరా లేకపోవడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
భారత్‌కు చేదు వార్తే..
ముడి చమురు ధరల పెరుగుదల భారత్‌కు ప్రతికూల విషయమే. భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధర ఇప్పటికే 2022 మార్చి 22, ఏప్రిల్ 6 మధ్య లీటరుకు రూ.10 పెరిగింది. అయితే సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించారు. అయితే క్రూడాయిల్ ధరలు పెరిగితే మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వ చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.