న్యూఢిల్లీ: క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్‌కాయిన్, ఎథరమ్ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి.
ఒకానొక దశలో అవలాంచే, శిబు ఇనూ, సోలానా, బిట్ కాయిన్ దాదాపు 13 శాతం మేరకు డ్రాప్ అయ్యాయి. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్ కూడా మేజర్ డౌన్‌ట్రెండ్‌ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బిఎన్‌బి టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు.
అటు ఎక్స్‌ఆర్‌పి కూడా గత 24 గంటల్లో 5.98 శాతం పడిపోయింది. ఏడిఏ టోకెన్ 7.47 శాతం తగ్గింది. డాజీకాయిన్ 5.95 శాతం క్రాష్ అయింది. మొత్తంమీద ప్రధాన టాప్ టోకెన్‌లు గత 24 గంటల్లో భారీగా పతనాన్ని నమోదు చేయడం గమనార్హం. అయితే యూఎస్‌డిటి టెథర్ గత 24 గంటల్లో దాని విలువలో 0.02 శాతం అప్‌ట్రెండ్‌ని, యూఎస్‌డిటి స్టేబుల్‌కాయిన్‌లు 0.01 శాతం అప్‌ట్రెండ్‌ని కనబర్చాయి. కాగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇపుడు అందరిపైనా కనిపిస్తోందినీ, ఇది క్రిప్టోల కదలికలపై కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జేపీ మోర్గాన్ చేజ్ సిఈవో జామీ డిమోన్ సూచించారు.