హైదరాబాద్ : జాతీయ వెనుకబడిన కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ వచ్చిన హన్సరాజ్ గంగారామ్‌ను హరిత ప్లాజాలో కలిసి తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సిఎస్ శాంతి కుమారి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓబిసిలకు రిజర్వేషన్లు, రిజర్వేషన్ రోస్టర్ అమలుపై బిసి కమిషన్ చైర్మన్ కు సిఎస్ వివరించారు.
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన “ షీ టీమ్స్ ” కార్యకలాపాలను కమిషన్ చైర్మన్‌ఖకు పోలీసు విభాగం డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం పోలీసు విభాగం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, విభాగంలో పోలీసుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను, అమలవుతున్న విధి విధానాలను ఆయనకు వివరించారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను పార్లమెంటు సభ్ములు డా.కె. లక్ష్మణ్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు టి. ఆచారి, సలహాదారు రాజేష్ కుమార్, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ అలోక్ కుమార్ ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.