హైదరాబాద్: భారత స్వాతంత్ర వజ్రిత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో 15వ తేదీన జరిగే భారత స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం పూర్తి రిహార్సల్స్ శనివారం చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించారు. ఈ నెల 15న ఉదయం పదిన్నరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్ నేడు ఉదయం నిర్వహించారు. ఈ పూర్తి స్థాయి ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. ఉదయం పదిన్నరకు గోల్కొండ కోటకు చేరుకొనే ముఖ్యమంత్రి పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పతాకావిష్కరణ కు వస్తున్న సందర్బంగా దాదాపు వేయి మంది కళాకారులు ముఖ్యంగా జానపద కళాకారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.
గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం రాష్ట్రీయ సైల్యూట్ ను పోలీస్ దళాలు అందచేస్తాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. మొత్తం కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ ప్రత్యేక స్క్రీన్ లను ఏర్పాటు చేసింది. హాజరయ్యే వారికి మంచినీటి సౌకర్యం తోపాటు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్ లను వేశారు. నేడు జరిగిన ఈ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను పరిశీలించిన వారిలో అదనపు డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యర్యదర్శి రిజ్వి, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.