సిఎస్ ఆదేశించినా ఉద్యోగులకు సంబంధించిన డిపిసి ఫైళ్లు కదలదడం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖలతో పాటు మరికొన్ని శాఖలకు సంబంధించి పదోన్నతుల సీనియార్టీని తయారు చేయాలని సిఎస్ ఆదేశించినా ఆయా శాఖల అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఆయా శాఖల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల్లో డిపిసి (డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ) కోసం ఫైలు పంపించడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు విముఖత చూపించడంపై టిజిఓ నాయకులు నెలరోజులుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే సీనియార్టీని తయారుచేసి ఫైళ్లను పంపించాలని సిఎస్ ఆదేశించినా ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం డిపిసికి ఫైళ్లను పంపకపోవడంతో రిటైర్‌మెంట్ అయ్యే అధికారులకు తమకు రావాల్సిన పదోన్నతిని కోల్పోతారని టిజిఓ నాయకులు ఆరోపిస్తున్నారు. సిఎస్ ఆదేశించినా ఎక్సైజ్ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు డిపిసికి సంబంధించిన ఫైళ్లను తయారు చేయడంలో నిర్లక్షం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు డిపిసి పెడితే వేరే వారికి పదోన్నతులు వస్తాయని, దీనివల్ల తాము నిర్వర్తించే బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్న భావనలో భాగంగానే ఈ ఫైళ్లను ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు కమర్షియల్ ట్యాక్స్‌లోనూ డిపిసి అయిన వారికి పదోన్నతులు రాకుండా కొందరు ఆ శాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి చేయడంతో టిజిఓ నాయకులు సిఎంఓ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలకు ఫిర్యాదు చేశారు.