కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎస్ కోరారు. బుధవారం ఉదయం ఆమె స్వయంగా ఎల్బీ స్టేడియానికి వచ్చి ఏర్పాట్లను పర్యావేక్షించారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను కోరారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదేవిధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.