Sunday, December 22, 2024

సిఎస్ రిలీవ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు సోమేశ్‌కుమార్ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు
ఆ వెనువెంటనే రిలీవ్ చేస్తూ డిఒపిటి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశం
రాష్ట్ర విభజన సమయంలో ఎపికి సోమేశ్
కేటాయింపు క్యాట్‌ను ఆశ్రయించి
తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్
క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని
హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం..
ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
2019 నుంచి తెలంగాణ సిఎస్‌గా
కొనసాగుతున్న సోమేశ్‌కుమార్
తీర్పు తరువాత సిఎం కెసిఆర్‌ను కలిసిన
సోమేశ్ సిఎస్ రేసులో హేమాహేమీలు
హైకోర్టు తీర్పుతో ఐఎఎస్‌లలో కొత్త టెన్షన్

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సిఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. సో మేష్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. 2014లో రాష్ట్ర విభజన సమయం లో అఖిల భారత స్థాయి ఉద్యోగుల విభజనలో భాగంగా కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దీనిని సవాల్ చేస్తూ అప్పట్లో ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. సోమేశ్‌కుమార్ పిటిషన్‌ను విచారించిన క్యాట్.. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీచేసింది.

అప్పటి నుంచి సోమేష్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతున్నా రు. కాగా.. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభు త్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. సోమేష్ కుమార్‌కు సంబంధించి  క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ కేంద్రం పట్టుట్టి.. ఇలాంటి నిర్ణయాలతో రెండు రాష్ట్రాల్లో సీనియారిటీ గొడవలు తలెత్తుతాయని, బ్యూరోక్రాటిక్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సోమేష్ కుమార్ తరపున సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా.. సిఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణలో సిఎస్ సోమేష్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. కాగా.. అప్పీల్ కోసం తీర్పు అమలుకు 3 వారాలు సమయం కావాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు కాపీ రాగానే ఎపికి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. 2019 డిసెంబర్ నుంచి సోమేష్‌కుమార్ తెలంగాణ సిఎస్‌గా కొనసాగుతున్నారు.

గంటల్లోనే రిలీవ్ ఆర్డర్

హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వ డి.ఓ.పి.టి.శాఖ తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌కుమార్ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈనెల 12వ తేదీలోగా రిపోర్టు చేయాలని డి.ఓ.పి.టి.ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ డి.ఓ.పి.టి. శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను సి.ఎస్.పదవి నుంచి తప్పించి కొత్తగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న సీనియర్ ఐ.ఎ.ఎస్.అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం తీర్పు కాపీ వెబ్‌సైట్‌లో వెలుగుచూసింది. వెనువెంటనే డి.ఓ.పి.టి.అధికారులు హైకోర్టు తీర్పును అమలు చేస్తూ మంగళవారం సాయం త్రం 3.30 గంటలకల్లా ఆయన రిలీవ్ చేయడమే కాకుండా ఈనెల 12వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కూడా ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారమంతా కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిపోవడంతో హైకోర్టు తీర్పుపై మాజీ సి.ఎస్. సోమేశ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశాలు కూడా లేకుండా పోయిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

డి.ఓ.పి.టి.వెంటనే స్పందించి ఆయనను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, ఆ ఉత్తర్వులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంపించడంతో సోమేశ్‌కుమార్‌కు వేరే మార్గం లేకుండా పోయిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఎస్.వంటి మొత్తం బ్యూరోక్రాట్లలో సంచలనంగా మారింది. డి.ఓ.పి.టి. నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే సి.ఎస్.సోమేశ్‌కుమార్ ప్రగతి భవన్‌కు వెళ్ళి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాలు, డి.ఓ.పి.టి. నుంచి వచ్చిన రిలీవింగ్ ఆర్డర్స్‌పై ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపికి కేటాయించింది.

ఈ తీర్పు అందరికీ వర్తిస్తుంది…

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.తదితర ఆలిండియా సర్వీస్ (ఎ.ఐ.ఎస్) అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం చీఫ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తీర్పుతో ఒక రాష్ట్ర కేడర్‌కు చెందిన ఆలిండియా సర్వీస్ అధికారులు ఎవ్వరైనా సరే తప్పనిసరిగా వారివారి సొంత రాష్ట్ర కేడర్‌లకు వెళ్ళిపోవాల్సిందేనని బ్యూరోక్రాట్లలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన కొందరు ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.అధికారులు తప్పనిసరిగా ఈ తీర్పు పరిధిలోకి వస్తారని, వారంతా తిరిగి ఏపీ కేడర్‌కు వెళ్ళిపోవాల్సిందేనని అంటున్నారు.

అందుచేతనే సి.ఎస్. సోమేశ్‌కుమార్‌తో పాటుగా తెలంగాణ రాష్ట్ర డి.జి.పి.గా ఇటీవలనే నియమితులైన అంజనీకుమార్ కూడా ఏపీ రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిందేనని, కాకుంటే కొద్దిరోజులు సమయం పడుతుండవచ్చునేమోగానీ క్యాట్ ఉత్తర్వులను అడ్డంపెట్టుకొని కేడర్‌ను మార్చుకొని తెలంగాణలో కొనసాగుతున్న అధికారులందరూ వారివారి సొంత రాష్ట్రాలకు (కేడర్) వెళ్ళిపోవాల్సిందేనని అంటున్నారు. అంతేగాక తెలంగాణ కేడర్‌కు చెందిన అధికారులు కూడా ఏపీలో కొందరు కొనసాగుతున్నారని, వారు కూడా తప్పనిసరిగా వెనక్కు (తెలంగాణకు) రావాల్సిందేనని కూడా ఆ అధికారులు వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిబడి ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఐ.ఎ.ఎస్. అధికారుల్లో చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో పాటుగా ఎ.వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, డి.రొనాల్డ్ రాస్, ఎం.ప్రశాంతి, అమ్రాపాలి ఉన్నారు. అదే విధంగా ఐ.పి.ఎస్.అధికారుల్లో రాష్ట్ర డి.జి.పి.అంజనీ కుమార్‌తో పాటుగా అభిలాష బిస్త్, సంతోష్ మెహ్రా కూడా ఏపి కేడర్‌కు చెందిన వారేనని వివరించారు. దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర కేడర్ ఐ.ఎ.ఎస్.అధికారి అయిన వై.శ్రీలక్ష్మీ కూడా ఎపిలో పనిచేస్తున్నారని, ఆమెను కూడా వెనక్కు రప్పించేందుకు కూడా అవకాశాలున్నాయని అంటున్నారు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.అధికారులను వారివారి సొంత కేడర్ స్టేట్‌లకు వెళ్ళేటట్లుగా చేయాలని డి.ఓ. పి.టి సీరియస్‌గా తీసుకొందని ఆ అధికారులు వివరించారు.

సిఎస్ పదవి రేస్‌లో హేమాహేమీలు…

తదుపరి సిఎస్ రేసులో అనేక మంది సీనియర్ అధికారులు రేస్‌లో ఉన్నారు. సీనియారిటీ ప్రకారం 1987 బ్యాచ్‌కు చెందిన వసుధ మిశ్రా ఉన్నారు. అయితే ఈమె కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారని,వచ్చే నెల ఫిబ్రవరిలో రిటైర్ అవుతున్నారు కూడా. ఆ తర్వాత 1988వ బ్యాచ్‌కు చెందిన వై.శ్రీలక్ష్మీ ఉన్నప్పటికీ ఆమె ఏపిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐ.రాణీ కుముదిని, 1989 బ్యాచ్‌కు చెందిన ఎ.శాంతికుమారి, 1990వ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్ గోయల్, సునీల్‌శర్మ, 1991వ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ రజత్ కుమార్, కె.రామకృష్ణారావు, హర్‌ప్రీత్‌సింగ్, జి.అశోక్ కుమార్ (కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు), అరవింద్‌కుమార్‌లు ఉన్నారు. ప్రస్తుతం ఈ అధికారులందరూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే చీఫ్ సెక్రటరీ పదవికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఎవ్వరినైనా సి.ఎస్.గా నియమించుకునే విస్తృతాధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News