మనతెలంగాణ/హైదరాబాద్ : నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జివొపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు రూ. 10వేల జరిమానా కూడా విధించింది. ఈక్రమంలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జివొ 123 చట్టబద్ధతపై 2016లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. కౌంటర్లు దాఖలు చేయాలని లేదా హాజరు కావాలని గత నెలలో సిఎస్ ను కోర్టు ఆదేశించింది .అయితే కౌంటర్లు దాఖలు చేయనందుకు సిఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్ కూడా వేయలేదని సిఎస్ పై హైకోర్టు అసంతృప్తి తెలిపింది. రూ.10వేలు చెల్లించాలని సిఎస్ సోమేష్ కుమార్ కు సిజె ధర్మాసనం ఆదేశాలిచ్చింది. పిఎం కోవిడ్ సహాయ నిధికి రూ.10వేలు చెల్లించాలని సిఎస్ కు హైకోర్టు ఆదేశాలివ్వడంతో పాటు వచ్చే ఏడాది(2022) జనవరి 24న విచారణకు హాజరు కావాలని సోమేష్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.