Friday, November 15, 2024

23 నుంచి గ్రేటర్ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -
CS Somesh kumar review on Covid vaccination drive
సిఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ నగరంగా రూపొందించేందుకు నగరంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కోసం శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, వందశాతం వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ నెల 23వ తేదీ నుంచి నగరంలోని 4,846 కాలనీలు, మురికివాడల్లో వచ్చే పదిహేను రోజుల్లోనే 360 లొకేషన్‌లలో ఈస్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 175 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలు 150 ప్రాంతాల్లోనూ, 25 కంటోన్మెంట్ ఏరియాల్లో పర్యటించి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.

ఒక్కో మొబైల్ వాహనంలో 2 వ్యాక్సిన్ వేసేవారు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని పేర్కొన్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్‌లు టీకాలు తీసుకోని వ్యక్తులను ముందుగానే గుర్తించి ఇంటింటికీ వ్యాక్సినేషన్ చేయిస్తారని అన్నారు. టీమ్ ముందుగానే వ్యాక్సినేషన్ తేదీ, సమయంతో పాటు టీకాలు వేయించుకోవాలని ప్రజలకు తెలియజేస్తుందని చెప్పారు టీకాలు వేసిన తర్వాత టీకాలు వేసిన ప్రతి ఇంటి తలుపుల మీద స్టిక్కర్ అతికించబడుతుందని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి, కంటోన్మెంట్ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు సరిపోయేంత తగిన పరిమాణంలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో ప్రజలకు స్పెషల్ డ్రైవ్ టీకాపై ఆడియో ప్రకటనతో పాటు బ్యానర్లు, ఆటో స్టిక్కర్లతో అవగాహన కల్పిస్తారని చెప్పారు.

టీకాలు వేయడం పూర్తయిన తర్వాత కాలనీ, మురికివాడల్లో 100 శాతం టీకాలు వేయడానికి ప్రోత్సహించడానికి, చైతన్యపరచడానికి కాలనీ ఆఫీస్ బేరర్ల సమక్షంలో బ్యానర్‌ను విడుదల చేసే వేడుకను కాలనీలో నిర్వహిస్తారన్నారు. 100 శాతం టీకాలు విజయవంతంగా పూర్తి చేసిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీలకు జిహెచ్‌ఎంసి కమిషనర్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించనున్న స్పెషల్ డ్రైవ్‌లో ప్రతి ఒక్కరూ సహకరించి వ్యాక్సిన్ వేసుకోవాలని సిఎస్ సోమేశ్‌కుమార్ ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ , జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సిఇఒ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, సిఎం ఒఎస్‌డి డాక్టర్ గంగాధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News