హైదరాబాద్ : నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది ధరఖాస్తు చేసుకోగా 10,637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17,913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి స్వీకరించడం జరిగిందన్నారు. ఈ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదుచేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని ఆదేశించారు.
లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటి అధికారులకు సూచించారు. సిజిజిలో రిజిష్ట్రరు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత డిస్కంలకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే నియమనిబంధనలు కూడ విడుదల చేసిందన్నారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బిసి వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, బిసి వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండి చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసి విమలతో పాటు పలువురు పాల్గొన్నారు.