Sunday, December 22, 2024

ప్రతి నియోజకవర్గంలో దళితబంధు..

- Advertisement -
- Advertisement -

ప్రతి నియోజకవర్గంలో దళితబంధు
ఎమ్మెల్యే సలహాతో వంద మంది ఎంపిక
లబ్ధిదారుల యూనిట్లకు రూ.10 లక్షలు మంజూరు
మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, సిఎస్ సోమేశ్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. దళితబంధు పథకం అమలును వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ బండి శ్రీనివాస్, బిఆర్‌కెఆర్ భవన్ నుంచి సిఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సిఎం. కార్యాలయం కార్యదర్శి, ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్‌సి కార్పొరేషన్ ఎండి కరుణాకర్‌లు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దళిత బంధు అమలుపై పలు ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు. రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో వంద శాతం గ్రౌండింగ్ చేయాలి. స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింపచేయాలి.ప్రతి లబ్ధిదారుడికి ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలి. ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలి. దేశంలోనే దళితబంధు ఒక అద్భుతమైన పథకం అని వారు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ.1200 కోట్ల కేటాయింపు. ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశాం. విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే, వాసాలమర్రి, హుజురాబాద్‌లో దళిత బంధు పథకం అమలులో ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో అమలు చేస్తున్నాం అని తెలిపారు.

CS Somesh Kumar vedio conference on Dalitha Bhandu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News