Tuesday, April 22, 2025

జోష్ తగ్గిన సిఎస్‌కె

- Advertisement -
- Advertisement -

వరుస ఓటములతో చెన్నై డీలా!

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఎదురులేని శక్తిగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే సిఎస్‌కె రికార్డు స్థాయిలో ఐదు ఐపిఎల్ ట్రోఫీలను సాధించి ముంబై ఇండియన్స్‌తో సమంగా నిలిచింది. ఈసారి కూడా సిఎస్‌కె టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉండడంతో చెన్నై మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేశారు. అంచనాలకు తగినట్టుగానే తొలి మ్యాచ్‌లో చెన్నై బలమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించి బోణీ కొట్టింది. కానీ సిఎస్‌కె ఆ తర్వాత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. వరుస ఓటములతో అభిమానులను నిరాశ పరిచింది.

ఆరంభ మ్యాచుల్లో రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు సారథ్యం వహించాడు. అతని కెప్టెన్సీలో చెన్నై ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. రుతురాజ్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. బ్యాటర్‌గా బాగానే రాణించినా కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. ఇక రచిన్ రవీంద్ర వంటి యువ ఆటగాడు ఆరంభ మ్యాచ్‌లలో బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను కూడా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబె తదితరులు చెత్త బ్యాటింగ్‌తో తేలిపోతున్నారు. రాహుల్, దీపక్‌లు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచలేక పోయారు.

వీరి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇక రుతురాజ్ గాయం వల్ల ఐపిఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో సీనియర్ ఆటగాడు ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ కెప్టెన్సీ చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. చెన్నై ఆటలో ఏమాత్రం మార్పురాలేదు. వరుస ఓటములు జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా తయారైంది. కీలక ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారు. రచిన్ రవీంద్రపై భారీ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్‌కు స్థానం కల్పించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. రషీద్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. విజయ్ శంకర్ కూడా కాస్త బాగానే ఆడుతున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు.

ప్లేఆఫ్ కష్టమే!

వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన సిఎస్‌కె ఆరింటిలో పరాజయం పాలైంది. రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి స్థితిలో చెన్నై ప్లేఆఫ్‌కు చేరడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చెన్నై నాకౌట్‌కు అర్హత సాధించడం దాదాపు కష్టమేనని చెప్పాలి. ముంబై చేతిలో ఓటమితో సిఎస్‌కె అవకాశాలు మరింత సన్నగిల్లాయి. చెన్నై మాత్రం రానున్న మ్యాచుల్లో మెరుగైన ఆటతో పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News