Saturday, November 23, 2024

సిఎస్‌కె @4

- Advertisement -
- Advertisement -
CSK IPL 2021 Trophy winning Moment
ధోనీ సేనదే ఐపిఎల్14
అయ్యర్ మెరుపులు వృథా, చెలరేగిన శార్దూల్, జడేజా, రాణించిన డుప్లెసిస్
ఫైనల్లో కోల్‌కతాపై చెన్నై విజయం

దుబాయి : ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఫైన ల్లో సిఎస్‌కె 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ చిత్తు చేసి తన ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోఫీని జమ చేసుకుంది. ఇక మూడో ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడాలని భావించిన కోల్‌కతాకు నిరాశే మిగిలింది. ముందుగా బ్యాటి ంగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి ఓటమి పాలైంది. సిఎస్‌కె బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టారు.

శుభారంభం లభించినా..

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు సిఎస్‌కె బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. గిల్ సమన్వయంతో ఆడగా అయ్యర్ తన మార్క్ దూకుడుతో అలరించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ ఆడడంతో కోల్‌కతా లక్షం దిశగా అడుగులు వేసింది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఇదే క్రమంలో అయ్యర్ తన ఖాతాలో మరో అర్ధ సెంచరీని జమ చేసుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో అలరించిన వెంకటేశ్ 32 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. అయితే జోరుమీదున్న అయ్యర్‌ను శార్దూల్ వెనక్కి పంపాడు. అప్పటికే తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించాడు.

క్యూ కట్టారు..

తర్వాత వచ్చిన నితీశ్ రాణాను కూడా ఠాకూర్ ఔట్ చేశాడు. రాణా ఖాతా కూడా తెరవలేదు. ఆ వెంటనే సునిల్ నరైన్ కూడా వెనుదిరిగాడు. రెండు పరుగులు చేసిన అతన్ని హాజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 43 బంతుల్లో ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ అయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ కూడా నిరాశే మిగిల్చాడు. ఒక సిక్సర్‌తో 9 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో పెవిలియ న్ బాట పట్టాడు. ఆ వెంటనే షకిబ్ అల్ హసన్ కూడా ఔటయ్యాడు. అతను ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. అతన్ని కూడా జడేజానే ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠిఆ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. రెండు పరుగులు మాత్రమే చేసి శా ర్దూల్ బౌలింగ్‌లో కంగుతిన్నాడు. ఇక కెప్టెన్ మోర్గాన్ కూడా నిరాశ పరిచాడు. 8 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. చివర్లో లూకి ఫెర్గూసన్ 18 (నాటౌట్), శివమ్ మావి (20) కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్షం భారీగా ఉండడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కోల్‌కతా స్కోరు 165 పరుగులకే పరిమితమైంది.

నిలకడగా ఆడుతూ..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన సిఎస్‌కెకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడీని విడగొట్టేందుకు కోల్‌కతా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ 27 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించాడు.

డుప్లెసిస్ జోరు..

మరోవైపు డుప్లెసిస్ తన జోరును కొనసాగించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. దూకుడుగా ఆడుతూ స్కోరు పరిగెత్తించాడు. అతనికి డుప్లెసిస్ కూడా తోడు కావడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. చెలరేగి ఆడిన ఉతప్ప 15 బంతుల్లోనే మూడు సిక్సర్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన మోయిన్ అలీ కూడా దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన మోయిన్ అలీ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 20 బంతుల్లోనే 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ధాటిగా ఆడిన డుప్లెసిస్ 59 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు బౌండరీలతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో చెన్నై స్కోరు నిర్ణీత ఓవర్లలో 192 పరుగులకు చేరింది. డుప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు లభించింది. సిరీస్‌లో వికెట్ల పంట పండించిన హర్శల్ పటేల్ (బెంగళూరు) ప్లేఆయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News