Monday, December 23, 2024

నేటి నుంచి ఐపిఎల్ సంగ్రామం

- Advertisement -
- Advertisement -

అందరికళ్లు జడేజా, శ్రేయస్‌పైనే
తొలి మ్యాచ్‌లో చెన్నైతో కోల్‌కతా ఢీ

CSK vs KKR Dream11 Prediction

 

ముంబై: అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా సంగ్రామానికి శనివారం తెరలేవనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె), కోల్‌కతా నైట్‌రైడర్స్ (కెకెఆర్) తలపడనున్నాయి. ఈసారి ఐపిఎల్‌లో పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇక కరోనా భయం పూర్తిగా తగ్గక పోవడంతో ఈసారి ఐపిఎల్‌ను నాలుగు వేదికల్లోనే నిర్వహించనున్నారు. ఇక శనివారం ఆరంభమయ్యే లీగ్ మ్యాచ్‌లు మే 22న ముగుస్తాయి. కాగా, నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను, వేదికలను ఇప్పటి వరకు ప్రకటించలేదు.

కిందటిసారి ఐపిఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన 8 జట్లతో పాటు తాజాగా మరో రెండు ఫ్రాంచైజీలు కొత్తగా జతకట్టాయి. చెన్నై, కోల్‌కతా, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఐపిఎల్ బరిలో నిలిచాయి. ఈసారి మెగా వేలం పాటలో యువ ఆటగాళ్లపై కనక వర్షం కురిసింది. అంతేగాక గతంలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లు ఇతర జట్లలోకి వెళ్లిపోయారు. ఈసారి కోల్‌కతాకు భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నాడు. ఇక చెన్నై జట్టుకు కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు.

ఇప్పటి వరకు సారథిగా వ్యవహరించిన దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు కొత్త జట్టు గుజరాత్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లక్నో టీమ్ సారథిగా కెఎల్.రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇక బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంతో సౌతాఫ్రికా స్టార్ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పంజాబ్ కింగ్స్‌కు మయాంక్ అగర్వాల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే రాజస్థాన్, ఢిల్లీ, ముంబై, సన్‌రైజర్స్ జట్లు కెప్టెన్‌లను మార్చలేదు. ఇంతకుముందు సారథ్యం వహించిన వారే ఈ సీజన్‌లో కూడా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

హోరాహోరీ ఖాయం..

కాగా, ఈసారి ఐపిఎల్‌లో హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. భారీ మార్పుల నేపథ్యంలో ఏ జట్టు ఎలా ఆడుతుందో అంతుబట్టకుండా పోయింది. చెన్నై, ముంబై, కోల్‌కతా జట్లలో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోయినా ఇతర జట్లలో కొత్త ఆటగాళ్లు చేరారు. డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, కృనాల్ పాండ్య, రాజపక్స, షారుక్ ఖాన్, యశ్ ధుల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, సిఫర్ట్, వెంకటేశ్ అయ్యర్, జడేజా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తదితరులు ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. అంతేగాక సీనియర్లు విరాట్ కోహ్లి, అశ్విన్, మహేంద్ర సింగ్ ధోని, బ్రావో, రహానె తదితరులు ఎలా ఆడుతారన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులు..

ఈసారి ఐపిఎల్‌లో పరిమిత సంఖ్యలోనే అభిమానులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కరోనా భయం ఇంకా వెంటాతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐపిఎల్ మ్యాచ్‌లను చూసేందుకు 25 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర క్రికెట్ సంఘం నిర్ణయించింది. అయితే కిందటిసారి ప్రేక్షకులు లేకుండానే ఐపిఎల్‌ను నిర్వహించారు. ఈసారి మాత్రం పరిమిత సంఖ్యలోనైనా అభిమానులకు అనుమతి ఇవ్వడం కాస్త ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి.

భారీ ఏర్పాట్లు..

ఐపిఎల్ మెగా టోర్నమెంట్‌కు భారత క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. టోర్నీలో పాల్గొంటున్న క్రికెటర్ల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీని కోసం పకడ్బంది బయోబబుల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగేందుకు బిసిసిఐ సిద్ధంగా ఉంది. అంతేగాక ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు ఈసారి ఐపిఎల్ నిర్వహణలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయని జట్లపై భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇక మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే అభిమానులు కరోనా నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని బిసిసిఐ స్పష్టం చేసింది. దీన్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు సయితం వెనుకాడబోమని హెచ్చరించింది. అంతేగాక టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లకు కూడా పలు మార్గదర్శకాలకు జారీ చేసింది. మొత్తం మీద ఈసారి ఐపిఎల్ నిర్వహణ బిసిసిఐకి ఒక సవాల్ వంటిదేనని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News