నేడు పంజాబ్‌తో పోరు
చండీగఢ్: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. ఈ సీజన్‌లో చెన్నై పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. ఒక్క మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయలేక పోతుంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఇలాంటి స్థితిలో పంజాబ్‌తో జరిగే పోరు జట్టుకు కీలకంగా తయారైంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన స్థితి చెన్నైకి నెలకొంది. కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుపై ప్రభావం చూపుతోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రుతురాజ్ ప్రభావం చూపలేక పోతున్నాడు.కిందటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన డెవోన్ కాన్వే కూడా నిరాశ పరిచాడు.
రచిన్ రవీంద్ర కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. శివమ్ దూబె కూడా స్థాయికి తగ్గ ఆటను కనబరచ లేకపోతున్నాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ చేతులెత్తేస్తుండడంతో చెన్నైకి వరుస ఓటములు తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లోనూ వీరు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడూ ఐపిఎల్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన చెన్నై ఈ సీజన్‌లో మాత్రం అత్యంత పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన చెన్నైకి ఈసారి ఏదీ కలిసి రావడం లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ పేలవమైన ఆటతో తేలిపోతోంది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా చెన్నై మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహేంద్ర సింగ్, రవీంద్ర జడేజా, అశ్విన్ వంటి సీనియర్లు జట్టుకు అండగా నిలవక తప్పదు. ధోనీ అనుభవాన్ని రుతురాజ్ సద్వినియోగం చేసుకోవాలి. ఇదిలావుంటే ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన చెన్నై ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో చెన్నై తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ స్థితి నుంచి బయట పడాలంటే చెన్నై సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.
ఫేవరెట్‌గా కింగ్స్..
మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. నెహాల్ వధేరా, మ్యాక్స్‌వుల్, శశాంక్ సింగ్, చాహల్, మార్కొ జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులతో పంజాబ్ బలంగా కనిపిస్తోంది. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.