నేడు బెంగళూరుతో చెన్నై ఢీ
చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచుల్లో విజయం సాధించి జోరుమీదున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఇరు జట్లలోనూ కొదవలేదు. ప్రపంచ స్థాయి బౌలర్లు, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనను కనబరిచింది. హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్య చిరస్మరణీయ బ్యాటింగ్‌తో కోల్‌కతా బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. హాజిల్‌వుడ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన రెండు వికెట్లను తీశాడు. కృనాల్ కూడా నాలుగు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి మూడ వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక యశ్ దయాళ్, సుయాన్షు శర్మ, రసిక్ సలామ్ తదితరులతో బెంగళూరు బౌలింగ్ బలంగా ఉంది.
కోహ్లి జోరు సాగాలి..
తొలి మ్యాచ్‌లో ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బెంగళూరుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇటు కోహ్లి, అటు సాల్ట్ తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురు దాడి చేశారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. కోహ్లి ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కోహ్లికి ఉంది. అతను చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. సాల్ట్ కూడా జోరుమీదున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఇద్దరు మరోసారి శుభారంభం అందిస్తే వరుసగా రెండో విజయం సాధించడం బెంగళూరుకు కష్టం కాకపోవచ్చు.
విజయమే లక్షం..
మరోవైపు తొలి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బలమైన ముంబైను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో చెన్నై బౌలర్లు సఫలమయ్యారు. నూర్ అహ్మద్ అసాధారణ బౌలింగ్‌తో అలరించాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన మూడు వికెట్లను పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, అశ్విన్, జడేజా, సామ్ కరన్ తదితరులతో చెన్నై బౌలింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బ్యాటింగ్‌లోనూ చెన్నై పటిష్ఠంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు జట్టులో ఉన్నారు.
రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, దీపక్ హుడా, సామ్ కరన్, ధోనీ, జడేజా వంటి మ్యాచ్ విన్నర్ బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ రచిన్ రవీంద్ర అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ముంబైపై రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లోనే 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.