నేడు రాజస్థాన్‌తో చెన్నై ఢీ
గౌహతి: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం గౌహతి వేదికగా జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతుల్లో రాజస్థాన్‌కు పరాజయం ఎదురైంది. ఇలాంటి స్థితిలో పటిష్టమైన చెన్నైతో జరిగిన పోరు రాజస్థాన్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. సంజు శాంసన్ కెప్టెన్సీకి దూరంగా ఉండడం రాజస్థాన్‌కు ప్రతికూలంగా మారింది. రియాన్ పరాగ్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడు.
దీని ప్రభావం జట్టుపై బాగానే కనిపిస్తోంది. ఇక కిందటి మ్యాచ్‌లో శాంసన్, యశస్వి, నితీశ్ రాణా తదితరులు బ్యాటింగ్‌లో తేలిపోయారు. వీరి వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా తయారైంది. యశస్వి, రాణా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచారు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. శాంసన్, యశస్వి, పరాగ్, రాణా, జురేల్, హెట్‌మెయిర్, హసరంగా వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నా రాజస్థాన్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా రాజస్థాన్ విజయం సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
పరీక్షలాంటిదే..
ఇక కిందటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమి పాలైన చెన్నైకి కూడా ఈ పోరు సవాల్‌గా తయారైంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూంగా మారింది. రచిన్ రవీంద్ర ఒక్కడే ఒంటరి పోరా టం చేస్తున్నాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కరన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు చెన్నైలో ఉన్నారు. కానీ కిందటి మ్యాచ్‌లో వీరంతా విఫలమయ్యారు.
దీంతో బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో రాజస్థాన్‌తో పోరు చెన్నైకి సవాల్‌గా తయారైంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ రుతురాజ్‌పై నెలకొంది. త్రిపాళి, దీపక్ హుడా, సామ్ కరన్, శివమ్ దూబె తదితరులు కూడా మెరుగైన ఆటను కనబరచక తప్పదు. అప్పుడే చెన్నైకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.