ధోని సేనకు బ్రహ్మరథం
మహి పేరుతో దద్దరిల్లిన స్టేడియం..
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్16లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తుది సమరంలో చెన్నై చిరస్మరణీయ విజయం సాధించి తన ఖాతాలో ఐదో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న ఐదు ఐపిఎల్ ట్రోఫీల రికార్డును చెన్నై సమం చేసింది. తాజా టైటిల్‌తో చెన్నై కూడా ముంబైతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై విజయం సాధించడంతో సిఎస్‌కె సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో నరేంద్ర మోడీ స్టేడియం దద్దరిల్లి పోయింది. ఐపిఎల్ చరిత్రలో ధోని ఉన్నంత ఆదరణ మరే క్రికెటర్‌కు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ధోని అంటే ఎంతో అభిమానం.
ఇక తాజాగా ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ అభిమానులు ధోని బ్రహ్మరథం పట్టారు. సొంత జట్టు గుజరాత్‌ను కాదని వేలాది మంది అభిమానులు ధోనికే మద్దతుగా నిలిచారు. దీన్ని బట్టి ధోనికి ఉన్న ఆదరణ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది. నరేంద్ర మోడీ స్టేడియం ధోని నామస్మరణతో మారుమోగింది. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరగడంతో సొంత మైదానం.. బయటి మైదానం అనే తేడా లేకుండా ధోని కనిపిస్తే చాలు అభిమానులు ఉప్పొంగి పోయారు. ఈలలు, కేరింతలతో స్టేడియడం మొత్తం దద్దరిల్లి పోయింది. స్టేడియంలో అభిమానులు చేసిన శబ్దాలు 120 డెసిబెల్స్ స్థాయికి చేరాయి. అంటే ఒక విమానం గాల్లోకి ఎగిరే ముందు చేసే శబ్దం కంటే కూడా ఇది ఎక్కువ. దీన్ని బట్టి మహేంద్ర సింగ్ ధోనికి అహ్మదాబాద్‌లో ఎలాంటి ఆదరణ లభించిందో ఊహించుకోవచ్చు.
ప్రశంసలే ప్రశంసలు
మరోవైపు చారిత్రక విజయం సాధించిన మహేంద్ర సింగ్ ధోని సేనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా ధోనిపై, సిఎస్‌కె టీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐపిఎల్‌లో చెన్నైకి ఐదో ట్రోఫీని సాధించి పెట్టిన కెప్టెన్ ధోనిని ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేశారు. ధోని అసాధారణ ప్రతిభ వల్లే చెన్నై ఐపిఎల్ టైటిల్‌ను సాధించిందని వారు ప్రశంసించారు. ఐపిఎల్ చరిత్రలోనే ధోనిని మించిన కెప్టెన్ ఎవరూ లేరని అభిమానులు కొనియాడారు. పలువురు మాజీ క్రికెటర్లు సయితం ధోనిపై ప్రశంసలు కురిపించారు. వయసు పెరిగినా తనలో చేవ తగ్గలేదని ఈ విజయంతో మహి నిరూపించాడని వారు పేర్కొన్నారు.