Saturday, November 23, 2024

సిఎస్‌కె టాప్ గేర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరుపై ధోనీ సేన ఘన విజయం.. సిఎస్‌కె టాప్ గేర్
బ్రావో మ్యాజిక్, రాణించిన రుతురాజ్, డుప్లెసిస్, రాయుడు మెరుపులు
షార్జా: ఐపిఎల్ సీజన్14లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) విజయపరంపర కొనసాగుతోంది. యుఎఇలో జరుగుతున్న రెండో దశ టోర్నమెంట్‌లో సిఎస్‌కె మరో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఇక యుఎఇలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ బెంగళూరు ఓటమి చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన సిఎస్‌కె 18.1 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ శుభారంభం అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. రుతురాజ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. డుప్లెసిస్ ఒకవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలిచాడు. ధాటిగా ఆడిన గైక్వాడ్ 26 బంతుల్లోనే ఒక సిక్సర్, మరో నాలుగు ఫోర్లతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. మరోవైపు డుప్లెసిస్ రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మోయిన్ అలీ కూడా ధాటిగా ఆడాడు. అయితే రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసిన అతన్ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు. మరోవైపు రాయుడు దూకుడైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడు 22 బంతుల్లో ఒక సిక్స్, మరో మూడు ఫోర్లతో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా హర్షల్‌కే దక్కింది. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండు ఫోర్లతో 11 (నాటౌట్), సురేశ్ రైనా 17 (నాటౌట్) మరో వికెట్ నష్టపోకుండానే చెన్నైకి విజయం సాధించి పెట్టారు. దీంతో ఈ సీజన్‌లో చెన్నై ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
కోహ్లి, పడిక్కల్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, దేవ్‌దుత్ పడిక్కల్ శుభారంభం అందించారు. ఇద్దరు చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరు ఫోర్లు, సిక్స్‌తో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పడిక్కల్‌తో కలిసి తొలి వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక ధాటిగా ఆడిన పడిక్కల్ ఐదు ఫ్లోర్లు, మూడు సిక్స్‌లతో 50 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత చెన్నై బౌలర్లు పుంజుకున్నారు. బ్రావో, ఠాకూర్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి.

CSK Won by 6 Wickets against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News