Thursday, November 21, 2024

లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేయాలి: సీతక్క

- Advertisement -
- Advertisement -

లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేయాలి: మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కార్పొరేట్ కంపెనీలు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని సిఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కోరారు. కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. పలు కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలతో మంత్రి సీతక్క ప్రజాభవన్ లో ఆదివారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ మార్పులో కంపెనీలు, కార్పొరేట్లు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంపెనీలు తమ వంతు చేయూత నివ్వాలి విజ్ఞప్తి చేశారు. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు.

ఆదిలాబాద్, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. కంపెనీలు పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో తమ సామాజిక బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు. ఒక లక్ష్యంతో సిఎస్‌ఆర్ నిధులను వెచ్చిస్తే మార్పు తధ్యమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను, వనరులను, అవసరాలను కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు తెలియ చెప్పేందుకు వారితో కలిసి త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు దివాకర్ టిఎస్, రాజర్షి షా, పలు కంపెనీలు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News