Thursday, January 23, 2025

పత్తిపై ప్రత్యేక వ్యూహం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వానాకాల పంటల సాగుకు సంబంధించిన పంటల ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ సారి రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రత్యేక వ్యూహం సిద్దం చేసింది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పత్తి పంటకు ఉన్న మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పత్తిపంట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే పత్తిసాగు విస్తీర్ణత లక్ష్యాలను భారీగా పెంచింది. ఈ సారి వాతావరణ పరిస్థితులు , మార్కెట్‌లో పత్తి పంటకు ఉన్నడిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 70లక్షల ఎకరాలకు పత్తి సాగు పెంచాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

ప్రభుత్వ అంచనావేసిన పంటల సాగు లక్ష్యాలకు తగ్గట్టుగానే రైతులు కూడా ఈ సారి పత్తిసాగు పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలు సాధ్యపడితే గత ఏడాది కంటే రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం ఏకంగా 20లక్షల ఎకరాలకు పెరగనుంది. జాతీయంగా పత్తి సాగు విస్తీర్ణం , ఉత్పత్తిలో గుజరాత్ , మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రాష్ట్రంలో 58లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వం పత్తిసాగు విస్తీర్ణత పెరుగులపై పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరితే ఈ సారి తెలంగాణ పత్తి సాగు , ఉత్పత్తిలో దేశంలోనే రెండవ స్థానంలోకి చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 202223 సంవ్సరతంలో పత్తి సాగు విస్తీర్ణం 50లక్షల ఎకరాలకు మించలేదు.

అంతకు కిందటి ఏడాది 46.68 లక్షల ఎకరాల వద్దనే పత్తి సాగు విస్తీర్ణం అగిపోయింది. 202021లో పత్తి సాగు మంచి జోరు మీద సాగింది. 59లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. ఈ ఏడాది పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం రైతులకు ఈ పంట సాగు పట్ల ఆసక్తిని పెంచింది. నల్లగొండ, అదిలాబాద్ , ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ , నారాయణపెట , జోగులాంబ గద్వాల , వరంగల్ , తదితర జిల్లాల్లో అధికంగా పత్తిసాగులో టాప్ టెన్ జిల్లాలుగా ఉంటున్నాయి. మిగిలిన వాటిలో మంచిర్యాల, నిర్మల్ , సంగారెడ్డి, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగరి జిల్లాల్లో సగటున ఒక్కో జిల్లాలో లక్ష ఎకరాల నుంచి రెండు లక్షల ఎకరాల వరకూ పత్తి సాగు జరుగుతోంది. ఈ సారి ఈ జిల్లాల్లో పత్తి సాగు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్వింటాలు రూ.8000గా అంచనా ధర
పత్తి పంటకు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉంటుండటంతో రైతులకు కూడా పత్తి సాగు లాభదాయకంగా మారింది. పత్తి పంటకు సాగుకు ముందు, పంట కోత సమయంలో మార్కెట్ ధరల అంచనాలను రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా పత్తికి మద్దతు ధరలను జూన్ మూడవ వారంలలో ఖరారు చేస్తుంది. 202223 సంవత్సరానికి సంబంధించిన మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధరలను 2022జూన్ 15న ప్రకటించింది. మిడియం రకం పత్తికి రూ.6080,పొడవు పింజె రకం పత్తికి రూ.6380గా మద్దతు ధరను ప్రకటించింది. ఇదే ధరకు పత్తి కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పోరేషన్ ద్వారా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయించింది. ఈనెల 20న సిసిఐ కొనుగోలు కేంద్రాలు మూసి వేసింది.

మార్కెట్‌లో కనీసమద్దతు ధరకంటే వెయ్యి నుంచి రెండు వేలు వరకూ అధికంగానే ధరపెట్టి ప్రైవేటు వ్యాపారులు పత్తి కొనుగోలు చేయటంతో సిసీఐ కొనుగోలు కేంద్రాలవైపు రైతులు వెళ్లే అవకావం లేకుండా పోయింది. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ కేంద్రం ముందస్తు అచనాల ప్రకారం ఈ సారి కూడా పత్తికి క్వింటాలుకు రూ.8వేలు పైనే ధరలు లభించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు 350నుంచి 400రూపాయలు ఇప్పడున్న ధరల కంటే అధికంగా పెంచే అవకాశాలు ఉన్నట్టు సిసిఐ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఎగుమతులకు ఉన్న అవకాశాల ఆధారంగా పత్తి కనీస మద్దతు ధర రూ.7వేలకు పెంచే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News