ఖమ్మం : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాధ్యతగా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా నియంత్రించేందుకు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్త, ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సరఫరా మూలాలకు సంబంధించిన అన్ని అనుసంధానాలను గుర్తించి కట్టడి చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందన్నారు.
ఇందుకు అధికారుల సమష్టి కృషి, స్థానిక ప్రజల మధ్య సమన్వయం ఉండాలని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల రవాణాపై స్పష్టమైన సమాచారం అందుతుందన్నారు. దీని ఆధారంగా సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడానికి వీలవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం పెరిగితే ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి విద్యాలయాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా మార్పు తీసుకొని రావాలన్నారు.
జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ సరదా కోసం సిగరెట్‌తో మొదలవుతున్న యువత వ్యసనాలు, మద్యం, ఆ తరువాత మాదక ద్రవ్యాల వరకు వెళ్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్ర దుష్ప్రబావం చూపుతుందన్నారు. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న గంజాయి మాఫియా, చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి వ్యాపారాన్ని చాపకింద నీరులా విస్తరింపజేయ ప్రయత్నం చేస్తున్నారన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై వారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతున్నారని, తరచూ ఉద్రేకానికి లోనవుతూ, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి జ్యోతి, జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖర శర్మ, ప్రధాన ఆసుపత్రి సూపరంటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, జడ్‌పి సిఇఓ వివి అప్పారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, డిడి సోషల్ వెల్ఫేర్ అధికారి కె.సత్యనారాయణ, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.