బెంగళూరు/న్యూఢిల్లీ: దేశంలో పాలల్లో నీళ్లుగా, చాపకింద నీరుగా ఫక్కా హిందీవాదం ‘పెరుగు’తోంది. దేశంలో మోడీ ప్రభుత్వం తమ ఒక దేశం, ఒక భాష విధింపు క్రమంలో జనం రోజువారి వాడకంలో ఒక్కటైన పెరుగు కూడా వచ్చి పడింది. తమిళనాడు, కర్నాటకలలో నందిని పెరుగు ప్యాకెట్లపై ప్రధానంగా హిందీ పదం దహీ అని వాడాలని ఆహార భద్రత, ప్రమాణాల అధీకృత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఆదేశించింది. అసలుకే ఈ దక్షిణాది రాష్ట్రాలలో దహీ నహీ అంటే అర్థం కాని పరిస్థితి. కానీ ఈ నందిన పెరుగు ప్యాకెట్లపై ఖచ్చితం గా కొట్టొచ్చేలాగా దహీ పదం తోకపదాలుగా బ్రాకెట్లలో కన్నడలో అయితే మెసరు, తమిళంలో తయీర్ పదం వాడుకోవాలని స్పష్టం చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సంస్థ కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. తప్పనిసరిగా ఈ నందిని పెరు గు ప్యాకెట్లపై దహీ పదం వాడాల్సిందేనని కేంద్రం పరిధిలోని ఈ సంస్థ ఆదేశించడం, కాదనడానికి కుదరదని తేల్చిచెప్పడంతో దీని పై వివాదం పెరుగుతున్న హిందీ వాదం నెలకొంది.
పెరుగు జగడం చివరికి కేంద్రం రాష్ట్రాల మధ్య భాషా వివాదం తిరగదోడుకునే స్థితికి చేరుకుంది. కర్నాటక పాల సమాఖ్య (కెఎంఎఫ్)కు ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఆదేశాలు అందాయి. పెరుగు ప్యాకెట్లపై దహీ పదం వాడాలని లేదంటే కుదరదని తెలిపారు. ఇదే విధంగా తమిళనాడులో అక్కడి పాల సహకార ఉత్పత్తుల సమాఖ్యకు కూడా ఈ విశేషాదేశాలు అందాయి. తైర్ లేదా తయీర్‌ను దహీ పక్కన వాడుకోవచ్చునని తమ ఆదేశాలలో తెలిపారు. ఉత్తరాది భాష హిందీని దక్షిణాదిలోని హిందీ మాట్లాడని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక్కటి అని విమర్శలు వెలువడుతున్నాయి. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇప్పటికే కర్నాటకలో పలు కన్నడ సంఘాలు నిరసనకు దిగాయి. ఈ సంఘాల ప్రతినిధులు కర్నాటక పాల సమాఖ్య అధికారులను కలిశారు. అయితే ఇప్పటికైతే తాము పూర్తి స్థాయిలో ఈ కేంద్రీయ సంస్థ ఆదేశాల అమలుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అన్ని విషయాలు బేరీజు వేసుకుంటామని అధికారులు నచ్చచెప్పారు. పలు రకాల ఉత్పత్తులపై ఆంగ్లంతో పాటు తాము కేవలం ప్రాంతీయ భాషలలో పేర్లను జతచేస్తామని ఇప్పటికే తమిళనాడు, కర్నాటకలతో పాటు కేరళ కూడా తెలియచేసుకుంది.
కానీ అది కుదరదని పెరుగు ప్యాకెట్లపై ఖచ్చితంగా దహీ పదం వాడాల్సిందేనని కేంద్ర అధీకృత సంస్థ ఆయా ప్రభుత్వాల సంబంధిత విభాగాలకు తెలిపింది. ప్యాకెట్లలో పంపిణీ అయ్యే పాడి ఉత్పత్తులకు సంబంధించి ప్యాకెట్లపై సంబంధిత ఉత్పత్తుల ప్రమాణాలను తెలియచేయడం తప్పనిసరి అయింది. పాలు పాల ఉత్పత్తులను నిల్వ ఉంచే విధంగా చేసి, పంపిణీ చేసే క్రమంలో తయారీదార్లు ఖచ్చితంగా ఇందులోని ప్రమాణాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రామాణిక అంశాలతో కలిపి ఇప్పుడు ఈ సంస్థ ఈ రాష్ట్రాలలో పెరుగుకు దహీ పదాన్ని వాడితీరాల్సిందేనని ఆదేశించింది. తమకు ఢిల్లీ సంస్థ ఆదేశాలు వచ్చిన విషయాన్ని కర్నాటక ఇతర రాష్ట్రాలలోని విభాగాలు నిర్థారించాయి. ఈ ఆదేశాలను సమీక్షించాలని బెంగళూరు పాల సంఘం అధ్యక్షులు నరసింహమూర్తి కోరారు. ఈ విషయంపై తాము తిరిగి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐకు ఓ లేఖ పంపిస్తామని రాష్ట్రంలో అతి పెద్ద పాల సంఘం తరఫున ఆయన తెలిపారు. హిందీని ఇక్కడ బలవంతంగా ఆపాదించే యత్నాలను తాము ఏ స్థాయిలో అయినా వ్యతిరేకిస్తామని చెప్పారు.