Wednesday, January 22, 2025

తెలంగాణ పట్టణం జైనూర్ లో కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించారు.  ఓ ఆటో డ్రైవర్ అక్కడి గిరిజన మహిళపై లైంగిక దాడి చేయడానికి పూనుకోవడంతో ఈ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆమె కులానికి చెందిన వారు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

జైనూర్ లో బిఎన్ఎస్ఎస్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. అంతేకాక జిల్లాధికారులు జైనూర్ పట్టణంలో ఇంటర్నెట్ నిషేధం కూడా విధించారు.  బూటకపు వార్తలు, వదంతులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది.  ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) కూడా మోహరించినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది. ఒక వర్గం వారు మరో వర్గం వారిపై రాళ్ల దాడులకు పూనుకోవడం, ఆస్తులకు నష్టం కలిగించడం చేశారు.  ఆగస్టు 31న ఆటో డ్రైవర్(45) ఓ  గిరిజన మహిళ(31)పై లైంగిక దాడికి యత్నించడంతో పరిస్థితి విషమంగా తయారయింది. ఆటో డ్రైవర్ ఆమెను కర్రతో బాదడంతో ఆమె రోడ్డు మీదే స్పృహ తప్పి పడిపోయిందని సమాచారం.  తర్వాత ఆమెను పోలీసులు జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

గిరిజన సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాక గిరిజన పెద్దలతో మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు.  ఇరు వర్గాల వారిని శాంతియుతంగా ఉండమంటూ పోలీసులు పిలుపునిచ్చారు. నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News