Monday, December 23, 2024

వాట్సాప్ చిచ్చుతో ముప్పు…

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మొఘల్ పాలకుడు ఔరంగాజేబ్, టిప్పుసుల్తాన్‌లను కొనియాడుతూ వెలువడ్డ ఓ సామాజిక మాధ్యమ పోస్టింగ్ వివాదానికి దారితీసి, తీవ్ర ఉద్రిక్తతకు , లాఠీఛార్జికి దారితీసింది. పలు చోట్ల గుంపులు గుంపులుగా కొందరు రోడ్లపైకి రావడంతో ఈ పట్టణంలో బుధవారం ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అల్లర్లు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పాలకులను కీర్తిస్తూ వెలువడ్డ ఈ వ్యాఖ్యలు, ఫోటోలు ఓ వర్గాన్ని కించపర్చే విధంగా ఉన్నాయని , ఈ వాట్సాప్ చేష్టలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని హిందూ సంస్థలు కార్యకర్తలతో రోడ్లపైకి వచ్చాయి. పట్టణ బంద్‌కు పిలుపు నిచ్చాయి. రాళ్లు విసరడం, కొన్ని దుకాణాలపై దాడికి యత్నించడం వంటి ఘటనలు జరిగాయి. దీనితో వీరిని అదుపులోకి పెట్టేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు.

పోలీసులు లాఠీచార్జి జరిపారు. అయితే నిరసనకారులు పోలీసులపై రాళ్లు ఇటుకలు విసరడంతో దారిన వెళ్లే వారికి , పోలీసులకు గాయాలు అయ్యాయి. కొల్హాపూర్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద జనం భారీ ఎత్తున గుమికూడారు. వాట్సాప్ పోస్టింగ్‌లకు దిగిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. దీనితో పలు ప్రాంతాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణాయుత వాతావరణం నెలకొంది. సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేశాయి. కొన్ని ప్రాంతాలలో రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగినట్లు, దీనితో సామాన్య పౌరులు రోడ్ల మీదికి రాకుండా ఇండ్లకే పరిమితం అయినట్లు వెల్లడైంది. శివాజీ చౌక్‌లో కొందరు సమావేశం అయ్యారు.

పట్టణ బంద్‌కు పిలుపు నిచ్చారు. రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతున్న మూకను అదుపులోకి పెట్టేందుకు లాఠీచార్జి జరిపినట్లు పట్టణ ఎస్‌పి మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పోలీసు బలగాలకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. పలువురు సీనియర్ అధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. దురుద్ధేశపూరితంగా వ్యవహరించిన వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకుంటారని, దాడులకు దిగిన వారిపై కూడా చర్యలు ఉంటాయని సిఎం తెలిపారు.

కాగా రాష్ట్ర హోం మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సీనియర్ పోలీసు అధికారులను పిలిపించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రలో ఔరంగజేబును ప్రశసించే వ్యక్తులను క్షమించే ప్రసక్తే లేదని ఫడ్నవిస్ తెలిపారు. వారిపై పోలీసులు చర్యలకు దిగారని చెప్పిన ఆయన ముందు పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కొల్హాపూర్‌లో ప్రస్తుత పరిస్థితి యాత్రికులకు పలు ఇక్కట్లకు దారితీసింది. ప్రజలంతా సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News