ఇంఫాల్: గురువారం రాత్రి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిపై దాడి సహా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్‌లోని ఇంఫాల్ లోయ శుక్రవారం ఉదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రజలు నిత్యావసర వస్తువులు, మందులు కొనుగోలు చేయడానికి వీలుగా అధికారులు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం 5 గంటలనుంచి 11 గంటల వరకు కర్ఫూ సడలించారు. అయితే ఈ సడలింపు జనం గుంపుగా చేరడానికి, పెద్ద సంఖ్యలో కదలికలకు కానీ, ధర్నాలకు కానీ వర్తించదని ఓ అధికారిక ప్రకటన తెలిపింది.
ఇంఫాల్ లోయలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు మోహరించి ఉన్నప్పటికీ గురువారం రాత్రి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు చెందిన ఖాళీగా ఉన్న పూర్వీకుల ఇంటిపై దాడి చేయడానికి ఓ గుంపు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే భద్రతా దళాలు గాలిలోకి అనేక రౌండ్లు భాష్పవాయు గోళాలను పేల్చి ఈ ప్యత్నాన్ని భగ్నం చేశారు. అలాగే గురువారం రాత్రి రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.