న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రూ.2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం ప్రభావం కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ముగింపు వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి క్షీణించింది. గతేడాదిలో ఇది 8.2 శాతంగా ఉంది. రిజర్వు బ్యాంక్ ప్రకారం, రూ.2 వేల నోట్లు మొత్తం ఇంకా వెనక్కిరాలేదు. 2024 జనవరి 31 వరకు రూ. 2000 నోట్లలో 97.5 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి.
ఇప్పటి వరకు రూ.8,897 కోట్ల విలువైన పెద్ద నోట్లు ఇంకా మార్కెట్‌లోనే ఉన్నాయి. గడువు ముగిసినా ఇంత భారీ మొత్తంలో నోట్లు రావాల్సి ఉంది. రూ.2000 నోట్ల చలామణిలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుందని ఆర్‌బిఐ తెలిపింది. దీంతో ఫిబ్రవరి 9 వరకు ఈ కరెన్సీ చలామణి 3.7 శాతం తగ్గింది. ఇది ఏడాది క్రితం 8.2 శాతం ఉంది. కరెన్సీ అవసరాన్ని తగ్గించడంలో రూ.2000 నోటును తొలగించడం ఎంతగానో దోహదపడిందని ఆర్‌బిఐ పేర్కొంది. జనవరిలో బ్యాంకు డిపాజిట్లు బాగా పెరిగాయి.