అమెరికా దిశగా ఉధృత పయనం
హవానా : క్యూబాలో బుధవారం పెను హరికేన్ ఇయాన్ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున భీకర గాలులతో పవర్‌గ్రిడ్ పూర్తిగా దెబ్బతింది. దీనితో దీవిదేశం అయిన క్యూబా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలలో చీకట్లు అలుముకున్నాయి. హరికేన్ ప్రభావంతో క్యూబాలో ఇద్దరు మృతి చెందారు. వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దేశంలో పలు ప్రముఖ పొగాకు పంటపొలాలు ధ్వంసం అయ్యాయి. దేశంలోని పశ్చిమ చివరిలో ఈ భారీ తుపాన్ నెలకొంది. హరికేన్ ధాటితో దాదాపు కోటికి పైగా జనం విద్యుత్ సరఫరా అంతరాయాలతో నానా ఇక్కట్లకు గురయ్యారు. కేటగిరి 3 రకం తుపాన్‌గా ఇయాన్ నమోదైంది. దీని ప్రభావంతో పినార్ డెల్ రియో ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. క్యూబాకు ప్రఖ్యాతమైన సిగార్స్‌లో వాడే శ్రేష్టమైన పొగాకు ఇక్కడనే ఎక్కువగా పండుతుంది.ఈ ప్రాంతంలోని వేలాది ఎకరాల పొగాకు పొలాలు ధ్వంసం అయ్యాయని వార్తా సంస్థలు తెలిపాయి. ఇయాన్ హరికేన్ ఇప్పుడు అమెరికా వైపు దూసుకుపోతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఫ్లోరిడా ఇతర ప్రాంతాలలో గంటకు 195 కిలోమీటర్ల వేగంగా పెనుగాలులు వీస్తున్నాయి.