ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రతినిధులు సభా స్థలం ప్రగతి మైదాన్ చేరుకొనే దారిలో వచ్చే ప్రధాన కేంద్రాలలో కొత్తగా ఫౌంటైన్లను, కళాత్మక కట్టడాలను నిర్మించారు. అలాగే మరో వైపు పేదల ఇళ్లు, దుకాణాలు ఉండే దారులన్నీ పొడుగాటి, ఎత్తైన ఆకుపచ్చ బట్టతో మూసివేసి ఉంచారు. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన ఈ సమావేశాలకు పది రోజుల ముందుగానే ఆకుపచ్చ రంగు బట్టను సుమారు ఇరవై అడుగుల ఎత్తులో కట్టి వాటిపై జి 20 కి సంబంధించిన పోస్టర్లను అతికించారు. దీంతో కాలనీ వాసులకు గాలి, వెలుతురు అందకుండాపోయాయి. ఉక్కపోతతో ఊపిరాడడం లేదని అక్కడి ప్రజలు మొరపెట్టుకున్నా వినే వారు లేరు. తాము జంతువులం కాదు మనుషులమన్న కనీసజ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదని వారన్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అతికించిన ఈ ఫ్లెక్సీలపై ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అనే పదాలతో పాటు ‘వసుధైవ కుటుంబకమ్’ అనే జి 20 స్పెషల్ నినాదం కూడాఉంది. ఆ పదాలు, నినాదానికి ఢిల్లీ పేదలు అర్హులు కాదా అనే సందేహం వచ్చేలా పరదాలున్నాయి.
సొంత పనిపై ఢిల్లీలో నెల రోజులుండేందుకు వెళ్లిన మిత్రుడికి ఫోన్ చేస్తే ‘ఇక్కడే ఇంటి దగ్గరే ఉన్నాను. జి 20 మీటింగ్ అని చెప్పి ఢిల్లీలో అన్ని లాడ్జిలు ఖాళీ చేయిస్తున్నారు. చేసేదిలేక వచ్చేశాను’ అని చెప్పాడు. దేశదేశాల ప్రతినిధులు వస్తారు కాబట్టి ఈ మాత్రం భద్రతా ఏర్పాటు ఉండాలి కదా అనుకున్నాను. రక్షణ పేరిట ఢిల్లీ వీధుల్లో పేదల జీవితాలు దాచిపెట్టేందుకు ఆకుపచ్చ పరదాలు కట్టినారని తెలిసాక విస్మయం కలిగింది. జి20 సమావేశాల నిర్వహణపై ఘనంగా వార్తలు రాసిన పత్రికలు ఈ చాటు మాటు వ్యవహారం గురించి దాచిపెట్టినట్లుగానే ఉన్నాయి.
పరదాలంటేనే ఓ దాపరికం. వాస్తవాలను కనబడకుండా ఉంచటానికే పరదాలు పనికొస్తాయి. ఈ విషయాన్నీ యశ్ పాల్ అనే హిందీ రచయిత తన ‘పర్దా’ కథలో బాగా చెప్పారు. బాగా బతికి చెడిన కులీనుడి ఇంటి గుమ్మానికి ఖరీదైన పరదా ఉంటుంది. దాన్ని చూసి ఎంత ధనవంతుడో అనుకొని అప్పులిస్తుంటారు. చివరకు అప్పులు కట్టలేని స్థితిలో ఓ అప్పు ఇచ్చినాయన బాకీ వసూలు కింద ఈ పర్దా తీసికెళ్తాను అని పరదా లాగి వేస్తాడు. పరదా వెనుక చింకి బట్టలతో ఎండిన డొక్కలతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ మూలకు నక్కి కనబడతారు. ఆ వాస్తవాన్ని చూడలేక ఆయన పరదాను అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. పరదా వెనుక భయంకర సత్యాలు ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ.
ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రతినిధులు సభా స్థలం ప్రగతి మైదాన్ చేరుకొనే దారిలో వచ్చే ప్రధాన కేంద్రాలలో కొత్తగా ఫౌంటైన్లను, కళాత్మక కట్టడాలను నిర్మించారు. అలాగే మరో వైపు పేదల ఇళ్లు, దుకాణాలు ఉండే దారులన్నీ పొడుగాటి, ఎత్తైన ఆకుపచ్చ బట్టతో మూసివేసి ఉంచారు. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన ఈ సమావేశాలకు పది రోజుల ముందుగానే ఆకుపచ్చ రంగు బట్టను సుమారు ఇరవై అడుగుల ఎత్తులో కట్టి వాటిపై జి 20 కి సంబంధించిన పోస్టర్లను అతికించారు. దీంతో కాలనీ వాసులకు గాలి, వెలుతురు అందకుండాపోయాయి. ఉక్కపోతతో ఊపిరాడడం లేదని అక్కడి ప్రజలు మొరపెట్టుకున్నా వినేవారు లేరు. తాము జంతువులం కాదు మనుషులమన్న కనీస జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదని వారన్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అతికించిన ఈ ఫ్లెక్సీలపై ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అనే పదాలతో పాటు ‘వసుధైవ కుటుంబకమ్’ అనే జి 20 స్పెషల్ నినాదం కూడా ఉంది. ఆ పదాలు, నినాదానికి ఢిల్లీ పేదలు అర్హులు కాదా అనే సందేహం వచ్చేలా పరదాలున్నాయి.
దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ వద్ద గల కూలి క్యాంపును పూర్తిగా కప్పివేసి ఉంచారు. ఆర్‌కె పురం, నోయిడా, మునిర్కా ప్రాంతాలకు కూడా ఇలాంటి ముసుగు కప్పారు. ఇరుకైన సందుల్లో ఉండే నివాసులకు ఈ ఎత్తైన పరదాల వల్ల గాలి అందని పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై వచ్చి ఏదైనా కొనుక్కునేందుకు కూడా వీలు లేదు. ఎలాగో వచ్చినా పహారా ఉన్న పోలీసులు బూతులు తిడుతూ లోపలి పంపించి వేస్తున్నారని అన్నారు. ఇలా విదేశీయుల ముందు దేశ దారిద్య్రాన్ని కప్పిపుచ్చే బదులు తమకు సరియైన వసతులు కల్పిస్తే బాగుంటుందని అంటున్నారు. దినసరి కూలీలను పనికి వెళ్లేందుకు అనుమతించలేదు. కనీసం రోజుకు రూ.500 పరిహారంగా ఇచ్చినా బాగుండేదని కోరుతున్నారు. మున్సిపల్ సఫాయి కార్మికులు లోపలి రాలేకపోతున్నందుకు మురికి కాలువలు అలాగే ఉండిపోయి చెత్త ఎత్తుకపోనందు వల్ల అంతా గుమిగూడి దుర్వాసన వేస్తోంది.
మూడు రోజుల పాటు దుకాణాలు మూసేయమని చెప్పినా మూసి ఉంచే వాళ్ళం కానీ ఇలా పరదాలు పది రోజుల ముందే కట్టడం వల్ల ఎంతో నష్టపోతామని వ్యాపారాలు అంటున్నారు. ఇళ్లల్లో పని చేసుకుని బతికే వారు పని మానేస్తే జీవనోపాధి పోతుందని, వారిచ్చే మిగిలిన అన్నంతో మా పూట గడుస్తుందని, పనికి వెళ్లాలంటే పాస్ ఉండాలంటున్నారు. అదెవరిస్తారో ఎక్కడ దొరుకుతుందో ఎవ్వరు చెప్పడం లేదని అన్నారు. బట్టలు ఇస్త్రీ చేసుకుని బతికే తనకు పరదా మధ్య సందులోంచి బట్టలు తీసుకొని ఇచ్చేలా అవకాశ మీయమన్నా పోలీసులు ఒప్పుకోలేదని ఒకరి వేదన.
ఏ యే దేశాల్లోంచి ఈ సమావేశానికి ప్రతినిధులు వస్తున్నారో వారి దేశాల్లో కూడా తమ లాంటి పేదలున్నారని, కేవలం పరదాలు కడితే మన దేశంలో పేదరికం లేదని ఎవరు నమ్మరని అన్నారు. రోడ్ల మీద చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ ఫ్లై ఓవర్‌ల కింద బతికే వారిని ఖాళీ చేయిస్తే ముల్లె మూట సర్దుకొని రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో ఉన్న తమ సొంతూరుకు వెళ్లిపోయారు.
అలాగే ఆర్ కె పురం రోడ్డుపై ఉన్న గుడిసెలను నేల మట్టం చేశారు. అలా నిరాశ్రయులైన వారికి నిర్వాహకుల తరపున ఎలాంటి పునరావాసం లభించలేదు. ఎవరికి వారు తలదాచుకోవలసి వచ్చింది. భారత్ కిసాన్ యూనియన్ పూర్వాధ్యక్షుడు సుర్జీత్ సింగ్ పూల్ ట్విట్టర్‌లో ‘గరీబీ హటావోకు బదులు గరీబీ చుపావోను ప్రభుత్వం పాటిస్తోంది. ఆర్థిక అసమానతలు పరదాల చాటున దాచలేమని, పేదల ప్రభుత్వం అనే మాటలు చేతల్లో కనబడాలని’ పేర్కొన్నారు.
మన దేశం తలసరి ఆదాయం జి 20లో పాల్గొన్న అన్ని దేశాల కన్నా తక్కువ ఉంది. ప్రపంచ ఆకలి సూచికలో 121 దేశాల్లో మన దేశం 107 వ స్థానంలో ఉంది. పరదాలతో పేదరికం కంటికి కనబడకుండా దాచవచ్చేమో కానీ ఈ లెక్కలను దాచలేమని హర్ష మందర్ వ్యాఖ్యానించారు.
బడ్జెట్ లో జి 20 సదస్సుకు రూ. 990 కోట్లు కేటాయించగా, ఖర్చు మొత్తం రూ. 4100 అయిందని కాంగ్రెస్ విమర్శించింది. 2022లో ఇండోనేషియా రూ.364 కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఒక్క చైనా తప్ప మిగతా దేశాలన్నీ తక్కువ ఖర్చుతో ఈ సదస్సులను నిర్వహించాయి.
2020లో ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి అర కిలో మీటర్ దూరం రాత్రికి రాత్రే గోడ కట్టేశారు. ఇలా దేశాల ప్రతినిధులతో సదస్సులు నిర్వహించినప్పుడల్లా నగరం సుందరీకరణకు వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తూ, మరో వైపు పేదలను, కుక్కలను, కోతులను నగరం నుండి పారద్రోలుతూ, కూలి కాలనీలకు రంగు పరదాలు, గోడలు కడుతూ పోతుంటే ఆ సదస్సుల వల్ల సాధించేదేమిటి.. ‘వసుధైవ కుటుంబకమ్’ అంతా డొల్లతనమే అనిపిస్తుంది.
బి.నర్సన్
9440128169