Thursday, January 23, 2025

ఏటా 60 లక్షల మందిని పీడిస్తున్న కుషింగ్ సిండ్రోమ్

- Advertisement -
- Advertisement -

కుషింగ్ సిండ్రోమ్ వ్యాధి గురించి చాలా మందికి అవగాహన లేదు. మెదడు లోని పిట్యుటరీ గ్రంధి, మూత్రపిండం మీద ఉండే అడ్రినల్ గ్రంధి మీద కణితి ఏర్పడి, పెద్ద మొత్తంలో అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్‌ను విడుదల చేసినప్పుడు కుషింగ్స్ వ్యాధి వస్తుంది. ఏ వ్యాధో తెలియని పరిస్థితుల్లో 1912 లో మొదటిసారి ఇది పాలీ గ్లాండ్యులర్ సిండ్రోమ్ అని వ్యవహరించారు. దాదాపు 90 సంవత్సరాల క్రితం 1932 లో న్యూరో సర్జరీ పితామహుడుగా ప్రసిద్థి చెందిన హార్వే కుషింగ్ ఈ వ్యాధిని గుర్తించారు. అప్పటి నుంచి కుషింగ్‌సిండ్రోమ్‌గా ఇది వాడుక లోకి వచ్చింది.

ఈ వ్యాధి ఫలితంగా కార్టిసాల్ ఉత్పత్తి అధికమై అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. ఏటా 60 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 2050 సంవత్సరాల వయసు వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ వ్యాధి మూడు రెట్లు ఎక్కువని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. అడ్రినల్ గ్రంథులు ప్రతి మూత్ర పిండం పైభాగంలో త్రిభుజాకారంలో ఉంటాయి.

కార్టిసాల్ అనే హార్మోన్ కార్టెక్స్ అడ్రినల్ గ్రంధుల బయటి పొర ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇదో స్టెరాయిడ్ హార్మోన్. ఇది కొవ్వులు, ప్రోటీన్లను వేరు చేయడానికి , ఒత్తిడి, రక్తపోటు నియంత్రణకు గుండె సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అందుకే కార్టిసాల్‌ను ఒత్తిడి హార్మోన్ అని అంటుంటారు. మెదడు లోని పిట్యుటరీ గ్రంధి లేదా మూత్రపిండం పైన ఉండే అడ్రినల్ గ్రంధిపైన ట్యూమర్ కారణంగా కార్టిసాల్ విడుదల బాగా పెరగడాన్ని హైపర్ కార్టిసోలిజం అని కూడా అంటారు.

ఇక కుషింగ్ సిండ్రోమ్ లక్షణాలను పరిశీలిస్తే..

మొటిమలు, ముఖం విపరీతంగా నల్లగా మారిపోవడం, మెడ వెనుక అదనంగా కొవ్వు చేరి, గూనిలా ఏర్పడటం (బఫెలో హంప్) , పొత్తికడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తే కుషింగ్ సిండ్రోమ్ అని అర్థం చేసుకోక తప్పదు. ఆకారంలో చాలా మార్పులు ఈ సిండ్రోమ్ తీసుకొస్తుంది. ఇంకా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతుంటాయి. దాహం అధికంగా వేస్తుంది. అలసట కలుగుతుంది. అతిమూత్ర విసర్జన, తలనొప్పి, విపరీతమైన మతిమరుపు కలుగుతాయి. అథిక రక్తపోటు, అవాంఛిత రోమాలు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వస్తాయి. మానసిక అస్థిరత కలుగుతుంది.

నిరాశ, తీవ్ర భయాందోళనలు కలుగుతుంటాయి. పురుషుల్లో వంధత్వానికి దారి తీస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. మూత్రం, రక్తం, హార్మోన్ల పరీక్ష ద్వారా కుషింగ్స్‌వ్యాధిని గుర్తించవచ్చు. అలాగే మెదడు, కిడ్నీ పైన, ఉన్న కణతిని గుర్తించేందుకు సీటీ స్కాన్ లేదా ఎంఆర్‌ఐ పరీక్షలు అవసరమవుతాయి. ఒకవేళ కణితి పెద్దదిగా ఉంటే ఆపరేషన్ చేయించుకోక తప్పదు. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష, ల్యాబ్ పరీక్షలు వల్ల జరుగుతుంది. ఇతర విశ్లేషణ పరీక్షలు కూడా నిర్వహించవచ్చు.

1)24 గంటల కార్టిసోల్ రహిత మూత్ర ( a 24 hour urinary free cortisol,ufc)
2) బాగా రాత్రి అయిన తరువాత లాలాజల కార్టిసోల్ పరీక్ష (late night salivary cortisol)
3) తక్కువ మోతాదు డెక్సామెథసోన్ అణిచివేత పరీక్ష (low dose dexa methasone suppression test)
4) పూర్తిగా రాత్రి డెక్సామెథసోన్ అణచివేత పరీక్ష ( overnight dexa methasone suppression test)
5) అడ్రినల్ గ్రంధుల యొక్క సిటి (ct) స్కాన్
కుషింగ్ సిండ్రోమ్ కి కారణమైన అంతర్లీన సమస్యని విశ్లేషించడానికి పరీక్షలు
1) కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ టెస్ట్ (corticotropin releasing hormone test )
2) హై డోస్ డెక్సామెథసోన్ అణచివేత పరీక్ష ( high dose dexamethasone suppression test )
3) బైలాటరల్ ఇంఫీరియర్ పెట్రసల్ సైనస్ శాంప్లింగ్ ( bilateral inferior petrosal sinus sampling )
కుషింగ్ సిండ్రోమ్ కోసం చికిత్స ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది. ఈ సిండ్రోమ్‌కు సంబంధించి అంతర్లీన కారణంపై ఆధారపడి మందులు ఈ విధంగా ఇస్తారు. 1. స్టెరాయిడ్ ఉత్పత్తిని నిరోధించడం, 2.గ్లూకోకోర్టికోయిడ్ రిసెప్టర్ ఇన్హిబిటర్స్ 3. ఏసిటిహెచ్ విడుదలను సవరించడం, 4. అడ్రినోలిటిక్ మందులు 5. ఒకవేళ వ్యక్తి కార్టిసోల్స్ కనుక తీసుకుంటుంటే లక్షణాలు తగ్గించడానికి తక్కువ మోతాదు సూచించబడుతుంది.

స్వయంగా ఆచరించవలసినవి …
వైద్యులు సూచించిన ఔషధ నియమాలు పాటించాలి. మద్యం, ధూమపానం మానుకోవాలి. ఈ వ్యసనాలుంటే మరింత హాని కలుగుతుంది. ఇతర సమస్యలు ఏర్పడతాయి. మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజూ తక్కువ స్థాయిలో వ్యాయామాలు చేయాలి. అధిక తీవ్రత ఉండే వ్యాయామాలు లేదా క్రీడల వల్ల కీళ్ల ఎముకల పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఒత్తిడిని నివారించగలిగితే కార్టిసాల్ అథిక ఉత్పత్తి తగ్గి పోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News