Sunday, March 30, 2025

మనిషి వధ కన్నా దారుణం పెద్ద ఎత్తున చెట్ట నరికివేత:సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

అధిక సంఖ్యలో చెట్లను నరికివేయడం మనుషులను చంపడం కన్నా దారుణం అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయలు వంతున ఒక వ్యక్తికి కోర్టు జరిమానా విధించింది. రక్షిత తాజ్ ట్రెపీజియం జోన్‌లో 454 చెట్లను నరికిన ఒక వ్యక్తి అభ్యర్థనను న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరిస్తూ ఆ వ్యాఖ్య చేసింది. ‘పర్యావరణం విషయంలో ఎటువంటి కనికరమూ ఉండరాదు. పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడం ఒక మనిషిని వధించడం కన్నా హీనం’ అని బెంచ్ పేర్కొన్నది. ఎటువంటి అనుమతీ లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికివేసిన 454 చెట్లను తిరిగి పెంచడానికి లేదా అవి కల్పించిన హరిత వాతావరణాన్ని తిరిగి సృష్టించడానికి ఎంత లేదన్నా 100 సంవత్సరాలు పడతాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మథుర వృందావన్‌లోని దాల్మియా ఫార్మ్స్‌లో శివ్ శంకర్ అగర్వాల్ అనే వ్యక్తి 454 చెట్లను నరికినందుకు చెట్టుకు రూ. 1 లక్ష వంతున జరిమానాను సిఫార్సు చేసిన కేంద్ర సాధికార కమిటీ (సిఇసి) నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. అగర్వాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఆయన తన తప్పిదాన్ని అంగీకరించారని చెప్పగా, జరిమానా మొత్తాన్ని తగ్గించేందుకు కోర్టు నిరాకరించింది. సమీప ప్రదేశంలో మొక్కలు నాటడానికి అగర్వాల్‌ను అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఆయన ఆ పని చేసిన తరువాతే ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కారం పిటిషన్‌ను పరిష్కరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. తాజ్ ట్రెపీజియం జోన్ లోపల అడవి కాని భూమిలో, ప్రైవేట్ భూముల్లో చెట్ల నరికివేతకు ముందస్తు అనుమతి పొందే నిబంధనను తొలగించిన తన 2019 ఉత్తర్వును కూడా సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News