Monday, December 23, 2024

సి.వి రచనలు జీర్ణించుకోవాలి

- Advertisement -
- Advertisement -

రక్త మాంసాలు గల మానవుణ్ణి ప్రేమిస్తాను
అవిటి చెవిటి మూగ దేవుణ్ణి మాత్రం నమ్మను
మానవుణ్ణి ద్వేషించే మీరు దేవుణ్ణి పూజిస్తారు
దేవుణ్ణి కాదనే నేను, మానవుణ్ణి ప్రేమిస్తాను!

‘నరబలి’ కావ్యంలో వేనుని కథని సి.వి. తనదైన ఆధునిక దృక్కోణంతో రాశారు. తన సిద్ధాంతాన్ని వేనుని పాత్ర ద్వారా అలా వెల్లడించారు. “పట్టెడన్నం పెట్ట నిరాకరిస్తున్న వర్గం/ అప్పనంగా మంది సొమ్ము తిన మరిగిన పూజారి, పురోహిత వర్గం/ కొండల్లో ఎన్నడో పారిపోయి బండరాయిలా దాక్కున్న నిన్ను/ వెతికి వెతికి పట్టుకొచ్చి వీధి కెక్కించారు గదరా! అని దేవుణ్ణి ఎద్దేవా చేశారు సి.వి. తన ‘ఊళ్ళోకి స్వాములోరు వచ్చారు’ కావ్యంలో ఇంతకీ ఎవరీ సి.వి? ఈ తరం యువతీ యువకులకు అంతగా పరిచయం వుండకపోవచ్చు. సి.వి. పూర్తి పేరు చిత్తజల్లు వరహాల రావు (14.1.1930 8.11.2017) కాని, పొడి అక్షరాలతో ‘సి.వి” గానే ప్రసిద్ధులు. కవి, రచయిత, హేతువాది, సాంస్కృతిక రథ సారథి, నిత్య పరిశోధకుడు, దిగంబర కవుల మార్గదర్శి, శాస్త్రీయ విజ్ఞాన కార్యకర్త, మార్క్ ఏంగిల్స్‌లను అమితంగా ప్రేమించిన వారు, సి.పి.ఐ (ఎం.ఎల్) వైపు నిలబడ్డానని ప్రకటించుకున్నవాడు.

కొన్ని విభేదాలు ఉన్నా శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడు ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. “సాయుధ విప్లవం ద్వారా ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకోవడం కష్ట జీవులు తమ భవితవ్యానికి తామే అధినాథులు కావడం” అని పారిస్ కమ్యూన్ సారాంశాన్ని విప్పి చెప్పారు సి.వి! గుంటూరులో జన్మించిన ఈ ముందుతరం రచయిత, మరణించేంత వరకు విజయవాడ హౌజింగ్ బోర్డు కాలనీలో వున్నారు. సి.వి తండ్రి వెంకటా చలపతి స్వాతంత్య్ర సమరయోధుడు. తల్లి లక్ష్మీ దేవమ్మ. గుంటూరు ఎసి కాలేజీలో బిఎ చదువుతూ వుండగా, విప్లవ దళిత కవి శివసాగర్ సి.వికి క్లాసుమేట్? తర్వాత ఎకనామిక్స్‌తో పి.జి., డిగ్రీ, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుండి తీసుకున్నారు (1953). మద్రాసులో విద్యార్థిగా వున్న రోజుల్లో ఎక్కువ కాలం అక్కడి కన్నెమెర గ్రంథాలయంలో గడిపేవాడు. కావల్సిన విషయాలన్నీ నోట్స్ రాసుకునేవారు. అవే ఆయనకు తర్వాత కాలంలో 30 పుస్తకాలు రాయడానికి ఉపయోగపడ్డాయి. (ఈయన ‘నరబలి’ గ్రంథాన్ని నారాయణ స్వామి కన్నడంలోకి అనువదిస్తే, కారుచీకట్లో రచనను వేగుంట మోహన్ ప్రసాద్ ఇంగ్లీషులోకి అనువదించారు.)

1950లలోని మార్కిస్ట్ ఉద్యమాలతో మమేకమైన సి.వి మొదట కవిగా సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు. తర్వాత కాలంలో విషయాలు వివరంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే పద్యం కన్నా గద్యమే సరైనదని గ్రహించారు. ఆ రకంగా ఎన్నో రచనలు వెలువరించారు. నరబలి, సత్యకామ జాబాలి, ఏడు కొండల వాడా గోవిందా, ఆంధ్రలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు, కారు చీకటిలో కాంతిరేఖ, స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ, భారత జాతీయ పునరుజ్జీవనం, విషాద భారతం, పారిస్ కమ్యూన్, కౌటిల్యుని అర్థశాస్త్రం, పుట్టు పూర్వోత్తరాలు వంటి పుస్తకాలన్నీ ఆయనను సామాజిక విప్లవ కారుడిగా నిలబెడతాయి. వర్ణ వ్యవస్థ, మనుధర్మ శాస్త్రం, ప్రాచీన భారతంలో చార్వాకం, ఆధునిక యుగంలో కుల వ్యవస్థ వంటి గ్రంథాలు ఆయన ఎంతటి హేతువాదో నిరూపిస్తాయి.

డార్విన్ పరిణామవాదం, సింధూ నాగరికత వంటి రచనలు ఆయనలోని వైజ్ఞానిక స్పృహను వెల్లడిస్తాయి. ఆయన స్వయంగా సైన్స్ విద్యార్థి కాకపోయినా వైజ్ఞానిక దృక్పథమన్నది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అంశమని ఆయన గ్రహించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, దళిత ఉద్యమ వైతాళికుడైన కుసుమ ధర్మన్నను వెలికి తీసి పరిచయం చేయడం మరొక ఎత్తు. అంతే కాదు దళిత సాహిత్యోద్యమానికి ఒక పునాది రాయి కావడం సి.వి. గొప్పదనం! ఆయనలో తెలియకుండానే ఒక గొప్ప పరిశోధకుడు, ఒక చరిత్రకారుడు, ఒక వైజ్ఞాణికుడు వుండడం విశేషం. ఈ లక్షణాలు లేని ఉట్టి కవులూ, రచయితలు తెలుగు వారిలో చాలా మంది వున్నారు. వారితో సమాజానికి ఎక్కువగా ఉపయోగం వుండదు. ప్రశ్నించనివాడు, ప్రశ్నను నిలబెట్టని వాడు హేతువాది కాని వాడి వల్ల సమాజానికి ఉపయోగమేమిటి? ఆ రకంగా పైరవీలు చేసి అవార్డులు తెచ్చుకున్న వారి కన్నా, ప్రభుత్వంలో వున్న వారికి భజనలు చేసి పదవులు అనుభవించిన వారి కన్నా సి.వి జీవితం చాలా చాలా విలువైంది.

అందుకే చెప్పేది, ఆయన రచనలు ఊరికే చదవడం కాదు అధ్యయనం చేయాలి! అంతకన్నా ముఖ్యం జీర్ణించుకోవాలి!! ఆచరించాలి. “నెరసిన గుబురు మీసాలు/ పెరిగిన బైరు గడ్డమూ/ మానవతను విరజిమ్మే నేత్రాలూ/ రక్తమూ కన్నీరు కలిసి సృష్టించిన కొత్త సిద్ధాంతాన్ని/ ప్రపంచ పీడిత ప్రజా కోటి సమర్పించే/ మానవోన్నతునిలా వున్న ఈయన ఎవరూ? ఆహా ఈయనే కార్ల్ మార్క్/ మూర్తీభవించిన తత్వశాస్త్రంలా ఉన్న ఏంజెల్స్‌” అని మార్కిజం సృష్టికర్తల్ని తన్మయత్వంతో పాఠకుల కళ్ళ ముందు చిత్రీకరించారు సి.వి. అంతేకాదు, ‘మానవోన్నతమూర్తి స్టాలిన్’ అనే ఒక స్మృతి గీతం కూడా రాశారు. కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఇంతగా పెనవేసుకుపోయిన సి.వి, సమకాలీనంలో వున్న కొందరు కమ్యూనిస్ట్‌లను తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే అది కమ్యూనిజం తప్పు కాదనీ, దాని విలువల్ని నిలుపుకోలేని కొందరు వ్యక్తుల తప్పిదమని వివరణ ఇచ్చారు. వామపక్ష వాదులలో సైతం ఇంకా వదలని కులతత్వాన్ని, ప్రాంతీయ విభేదాల్ని ఎత్తి చూపడానికి ఆయన ఏ మాత్రం జంకలేదు, గొంకలేదు వ్యక్తులకైనా, పార్టీలకైనా, అధికారంలో వున్నవారికైనా, లేనివారికైనా అంతర్మథనం అవసరం. ఆత్మ విమర్శ అన్నింటి కంటే ముఖ్యం.

సమాజంలోని కులం, మతం, వర్ణ వ్యవస్థ వంటి విషయాల పట్ల కమ్యూనిస్ట్‌లు చేయాల్సినంత చేయలేదని సి.వి భావన. అందుకే ఆయనే స్వయంగా ఆయా విషయాలపై విస్తృతంగా రచనలు చేస్తూ వచ్చారు. “వర్ణ వ్యవస్థ లాంటి భ్రష్టమైన వ్యవస్థ ఈ భూమండలంలో ఎక్కడైనా వుందా? వైదిక పురోహిత పరాన్నభుక్కు వర్గమా/ పాలక వర్గ శునకాల్ని మీరు ఇస్కో ఇస్కో అంటూ/ పాలితులనే కవ్విస్తున్నారు/ వాళ్ళే ఇస్కో ఇస్కో అనే దశ ఆద్యంతాన భవిష్యత్తులో రాబోతోంది జాగ్రత్త!” అని పేదల, శ్రామికుల తిరుగుబాటు అనివార్యం అని ‘జాబాలి’ ద్వారా హెచ్చరించారు” (సత్యకామ జాబాలి 1972) శతాబ్దాలుగా కొనసాగుతున్న తతంగాన్నంతా సి.వి నాలుగు వాక్యాల్లో తేల్చేశారు. భారత దేశంలో ఫ్యూడల్ వర్గాలు బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రజలపై రుద్ది, సాంస్కృతికంగా కులాల్ని స్థిరపరిచాయి. అవి అలా కొనసాగడానికి కల్పిత పురాణాలు, నిచ్చెనమెట్ల వ్యవస్థ, ఆత్మలు పరమాత్మలు, పునర్జన్మలు, దేవుని పేరిట ఛాందస ఆచారాలూ సృష్టించి సమాజాన్ని కుళ్ళబొడిచారు. సి.వి ఇలాంటి విషయాలపై లోతుగా అధ్యయనం చేశారు. ఇతర ఏ కమ్యూనిస్ట్ రచయితా రాయనంత స్పష్టంగా, బలంగా గ్రంథ రచన చేసి కొత్త తరాల్ని కూడా ప్రభావితం చేశారు. ఈ విషయాలన్నింటినీ గుదిగుచ్చి ఉద్యమ స్వరూపాన్ని సి.వి స్పష్టంగా ఇలా వెల్లడించారు.

“కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకసారి, మత తత్తంపై మరోసారి, దున్నే వానికే భూమి అని ఒకసారి, రాజ్యాధికారానికి వేరొకసారి ఇలా ఉద్యమాలు, పోరాటాలు వేటికవి విడివిడిగా వుండవేమోనని నేననుకుంటున్నాను. దోపిడీ శక్తుల కులమూ, వర్గమూ, రాజ్యమూ కలగలిపి వున్న వ్యవస్థలో పీడిత కులాల వర్గాల ఉద్యమాలు, పోరాటాలే కాదు, ఉద్యమ శక్తులు కూడా కలగలిసే వుండాలి. వారి నడుమ కనీస సమన్వయం, సహకారం వుండాలి. పందులదొడ్డి కంటే హీనంగా దేశాన్ని దిగజార్చిన పాలకులు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశించకుండా, లొంగకుండా ఉద్యమ శక్తులు పోరాట చేవతో సమర శీలంగా సాగాలి. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో కృషి, సాంఘిక రాజకీయ రంగాల కృషితో సమన్వయం కావాలి. వర్గ పోరాటం అగ్రకుల వ్యతిరేక పోరాటంతో, భూస్వామ్య శక్తుల వ్యతిరేక పోరాటంతో భుజం భుజం కలిపి సాగాలి. దళితులు, మహిళలు, మైనారిటీలు, ఆదివాసీ పోరాటాలు, శ్రామిక వర్గ పోరాటాలతో మమేకం కావాలి” ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా ఉద్యమ స్వరూపం గురించి చెప్పిన రచయిత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ, కాలగమనంలో ఏమైంది? దళితులు, మహిళలు, మైనారిటీలు విడివిడిగా తమ తమ అస్థిత్వ పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అందరూ సంఘటితంగా, సమైక్యంగా ఉద్యమించాల్సింది పోయి, విడిపోవడం వల్ల బలహీనపడ్డాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులకు అధికారం అప్పగించడమంటే మిగతావన్నీ బలహీనపడ్డాయనే కదా అర్థం? ఇది తాత్కాలికం అనుకుని సి.వి సూచించిన మార్గంలో ఉద్యమించక తప్పదు! ఐక్య పోరాటానికి సంసిద్ధులు కాక తప్పదు.

సమాజంలో విశృంఖల స్వైర విహారం చేస్తున్న మూఢ నమ్మకాలు, దోపిడీ దౌర్జన్యాలు, ఆకలి హాహాకారాలకు వ్యతిరేకంగా నిరంతరం రాయడమే పోరాటమని నమ్మినవారు సి.వి. రాయడమే కాదు, దాదాపు 30 పుస్తకాలు స్వంత ఖర్చుతో ప్రచురించి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ప్రభుత్వం అటు బ్రాహ్మణ పెత్తందారీ వ్యవస్థ పెట్టే ఇబ్బందులు పడలేక కొన్ని రచనలు గుప్త నామాలతో రాసేవారు. శృంగేరీ పీఠాధిపతి విజయవాడ వచ్చినప్పుడు సి.వి జందెం వేసుకొని, మారువేషంలో అతని అనుచరులలో కలిసి అక్కడ జరిగే తంతు అంతా పరిశీలించారు. దాని ఫలితంగానే ‘ఊళ్ళోకి స్వాములోరు వచ్చారు’ అనే రచన చేయగలిగారు. తరిమెల నాగిరెడ్డి చేపట్టిన ఆందోళనోద్యమాన్ని నేపథ్యంగా తీసుకొని ఒక వాస్తవ సంఘటనని కవితగా మలిచారు. అదే ‘మంచి నీళ్ళడిగితే మూత్రం పోశారు’ శీర్షికతో జనశక్తి పత్రికలో అచ్చయ్యింది. సి.వి మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యార్థిగా వున్న రోజుల్లో అక్కడ సింహళ జాతీయుడైన ప్రొఫెసర్ చంద్రన్ దేవనేశన్ ప్రభావంలో పడిపోయారు.

మార్కిజంలోని శాస్త్రీయతను, విశిష్టతను ఆయన నుండి పుణికి పుచ్చుకొన్నారు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు కొడవటి గంటి, శ్రీశ్రీ లాంటి వారు స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి తటపటాయిస్తున్నప్పుడు సి.వి జనశక్తి పక్షాన నిలిచారు. 1963 మధ్యలో విశాలాంధ్ర నుండి విడిపోయి… జనశక్తి (సి.పి.ఐ.ఎం.ఎల్) పత్రికగా ప్రారంభమైనప్పుడు సి.వి సైద్ధాంతిక ఊగిసలాటలు లేకుండా విశాలాంధ్ర పత్రికను విడిచి ‘జనశక్తి’ పత్రిక వైపు నిలిచారు. తన గుండెల్లో అరుణ పతాక రెపరెపల్ని చివరి శ్వాస వరకు నిలుపుకొన్నారు. “నాయావద్రచనా వ్యాసంగానికి/ ప్రేరణగా వెలుగొందిన జననీ/ నా ఆశలకాశయాలకు ఊపిరి పోసిన తల్లీ/ ప్రియబాంధవీ! అరుణా! అరుణా! అరుణ పతాకమా!!” అంటూ ఆయన తన హృదయంలో ఎర్రజెండా స్ఫూర్తిని నిలుపుకొన్నారు. అందుకే విప్లవ కమ్యూనిస్టుల పక్షపత్రిక ‘జనశక్తి’ 2017 డిసెంబర్ 20 న కామ్రేడ్ సి.వి.కి అశ్రునివాళి సమర్పించింది. “మూఢ విశ్వాసాలపై 45 ఏళ్ళ పాటు తన మేధస్సుతో, సాహిత్య రూపాలతో, భావ విప్లవ రంగంలో సాంస్కృతిక పోరాటం సాగించిన విప్లవ కలం యోధుడు కామ్రేడ్ సి.వి.కి నివాళులు” అని ప్రకటించింది.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News