అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించాలని సివిసి సూచన
న్యూఢిల్లీ : వచ్చే నెల ప్రారంభం కానున్న నిఘా అవగాహన వారోత్సవాల ( విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ )సందర్భంగా ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల్లోని అవినీతిని బట్టబయలు చేసేలా విజిల్‌బ్లోయింగ్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించాలని కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ) అన్ని ప్రభుత్వ విభాగాలకు సూచించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ను నిర్వహిస్తారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతం: సమగ్రతతో స్వావలంబన అనే లక్షంపై ఈ నిఘా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల దృష్టా అవినీతిని బట్టబయలు చేసే వారిని పరిరక్షించాలన్న సంకల్పంతో విజిల్ బ్లోయెర్ తీర్మానాన్ని పిఐడిపిఐ ( పబ్లిక్ ఇంటరెస్టు డిస్క్లోజుర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్‌ఫార్మర్స్ )గా ప్రతిపాదించారు.
ఈ వారోత్సవాల్లో ప్రజల ఫిర్యాదుల పరిష్కార శిబిరాలను, వినియోగదారుల సమస్యల పరిష్కార శిబిరాలను నిర్వహించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచించింది. ఇవేకాక అవినీతి దుష్ప్రభావాలపై గ్రామ పంచాయతీల్లో అవగాహన కల్పించేలా అవగాహన గ్రామ సభలను నిర్వహించాలని సూచించింది. ఇదివరకటి విధానం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్రాంచి స్థాయిల్లో కనీసం రెండు గ్రామ పంచాయతీల్లో అవగాహన గ్రామ సభలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ ఈ రెండు నెలలూ స్పెషల్ క్లియరెన్స్ కేంపైన్ గా నిర్వహించాలని ఇంతవరకు పేరుకుపోయిన కేసులను, ఫిర్యాదులను పరిష్కరించాలని, శాఖాపరమైన దర్యాప్తులు, సిబిఐ నివేదికలపై అభిప్రాయాలు, వ్యాఖ్యలు సేకరించాలని సివిసి సూచించింది. అవినీతిపై సమష్టి పోరాటానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావడంలో భాగస్వామ్యం చేయడమే ప్రభుత్వ సంస్థల లక్షంగా ముందుకు సాగాలని సూచించింది.