Friday, November 22, 2024

జాతీయ జెండాను ఆవిష్కరించి సిడబ్ల్యూసి

- Advertisement -
- Advertisement -

సమావేశాలను ప్రారంభించిన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే
నాలుగు రాష్ట్రాల సిఎంలతో పాటు పలువురు ప్రముఖ నాయకుల హాజరు

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న సిడబ్ల్యూసి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమయింది.  ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సిడబ్ల్యూసి  సభ్యులు జాతీయ జెండాకు వందనం చేశారు. హైదరాబాద్‌లో హోటల్ తాజ్ కృష్ణ హాటల్‌లో జరుగుతోన్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతోన్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, ఈ సమావేశానికి సిడబ్ల్యూసి సభ్యులతో పాటు నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సిఎంలతో పాటు పార్టీ కీలక నేతలు కెసి వేణుగోపాల్, సుర్జేవాలా, జైరాం రమేష్ తదితర నేతలు హాజరయ్యారు. నేడు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగనున్నాయి.

సమావేశం రూమ్‌కు ‘భారత్ జోడో హాల్’గా నామకరణం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగే మందిరానికి ‘భారత్ జోడో హాల్’గా కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భారత్ జోడో యాత్ర సెకండ్ యాత్రపై చర్చ జరిగింది. రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిపిన మొదటిదశ భారత్ జోడో యాత్రతో పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో దాని పేరునే ఈ మీటింగ్ హాల్‌కు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. తాజ్ కృష్ణ హోటల్‌లోని థర్డ్ ఫ్లోర్‌లోని బాల్ రూమ్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండడంతో ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ‘భారత్ జోడో హాల్’గా పిలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News