హైదరాబాద్: వివాహం చేసుకుంటానని, వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… బెంగళూరు, అనేకల్ రోడ్డు, చందాపూర్‌కు చెందిన కుమార్ రాజ్‌వాన్‌ష్ వ్యాపారం చేస్తున్నాడు. ఇండియన్ మేనేజ్‌మెంట్ విద్యను చదివిన నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం, క్రషర్ ఇడస్ట్రీ, టీకప్పుల తయారీ వ్యాపారం చేశాడు. వ్యాపారంలో నష్టలు రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఆన్‌లైన్ డేటింగ్‌లో పలువురిని మోసం చేశాడు. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్‌లో విడో మహిళ పరిచయం అయింది.
తనకు బెంగళూరులో మంచి వ్యాపారం ఉందని చెప్పాడు. వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని, వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అలాగే బాధితురాలి కుమారుడికి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితురాలు వివిధ రకాల కారణాలు చెప్పడంతో పలు దఫాలుగా రూ.3లక్షలు ఆన్‌లైన్‌లో పంపించింది. కొద్ది రోజుల తర్వాత నిందితుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ కేసు దర్యాప్తు చేశారు.