Wednesday, February 19, 2025

అక్షరం తేడాతో మేఘాకు రూ.5కోట్ల టోకరా

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ యాజమాన్యాన్ని సైతం సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయిం చింది. సైబర్ మోసంపై మేఘా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విమెంట్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు.

చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ లాగానే ఈ మెయిల్‌లో ఒక అక్షరం మార్చి మెయిల్ చేశారు. కొన్ని కారణాల వల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు. మరో అకౌంట్‌కు డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి మెయిల్ పంపించారు. అది నిజమని నమ్మి దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు కంపెనీ ప్రతినిధులు. అయితే అదే కంపెనీ నుంచి డబ్బులు చెల్లించలేదని మరో మెయిల్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన మేఘా కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిలువునా దోచేస్తున్నారు… !
ఇప్పటి వరకు మనుషులను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు కంపెనీలపై పడింది. పకడ్బందీగా ప్లాన్ చేసి ఈజీగా నమ్మిస్తూ డబ్బులు వసూలు చూసి మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతుంటారు. అలాగే కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడు తుంటారు. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సైబర్ నేరగాళ్ల మోసంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తాన్ని క్షణాల్లోనే పోగొట్టుకుంటున్నారు బాధితులు. ఈ కేటుగాళ్ల ఉచ్చులో ఇప్పటికే అనేక మంది చిక్కుకున్నారు. ఎంతగానో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఈజీగా సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో కొందరు పడిపోతుంటారు.

పోలీసులు సైబర్ నేరాల విషయంలో ఎన్ని మార్లు అవగా హన కల్పించినా పదే పదే మోసపోతూనే ఉన్నారు. తాజాగా వ్యక్తులనే కాదు ఏకంగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కింది. దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక జనం నుంచి కార్పొరేట్ సంస్థలను కూడా బురిడి కొట్టిస్తూ సులువుగా డబ్బు సంపాదిం చేందుకు విచ్చలవిడిగా మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ , ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ , వెబ్ లింకు లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటు న్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు , ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News