Friday, December 20, 2024

కేవైసితో డబ్బులు కాజేస్తున్న సైబర్ చీటర్లు.!

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో ఎత్తుగడలతో ప్రజలను దోచుకుంటున్నారు. ఇది వరకు ఓటిపి, వివరాలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని పలు రకాల కారణాలు చెప్పి ఖాతాదారుల వివరాలు తెలుసుకుని డబ్బులు మాయం చేశారు. దీనిపై బ్యాంక్ అధికారులు, పోలీసులు పలువురికి విస్కృతంగా ప్రచారం కల్పించడంతో చాలామంది సైబర్ నేరస్థులు చెప్పినా కూడా వివరాలు చెప్పడంలేదు. అంతేకాకుండా ఏ రాష్ట్రానికి ఫోన్ చేస్తే వారి స్థానిక భాషను మాత్రం కొదిగా నేర్చుకుని మాట్లాడేవారు. దీంతో బాధితులు బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని నమ్మి వివరాలు చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే ఖాతా నుంచి విత్‌డ్రా చేసినట్లు వచ్చేది.

ఈ విధంగా చాలామంది బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే రికవరీ మా త్రం గగనంగా మారింది. వినియోగదారులు వివిధ రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంతో వాటికి సంబంధించిన కెవైసిని అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా పేటిఎం వినియోగదారులను సైబర్ నేరస్థులు టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు.

వివరాలు చెప్పిన వారి నుంచి సైబర్ దొంగలు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఎక్కువగా వస్తున్నాయి. కూకట్‌పల్లికి చెందిన గంజి విజయ కృష్ణ ఫిబ్రవరి 24వ తేదీన పేటిఎం కెవైసి పూర్తి చేయాలని లేకుంటే సస్పెండ్ చేస్తామని ఫోన్ చేసి చెప్పారు. ఆందోళన చెందిన బాధితుడు వెంటనే సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేశాడు. క్విక్ సఫోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రూ.1పంపించాడు. తర్వాత కొద్ది సేపటికి రూ.90,000 డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొండపాణినేని వెంకటేశ్వర్లు తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను అనుగుణంగా పేటిఎం కెవైసిని పూర్తి చేయడంతో సైబర్ దొంగలు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.59,999 పోగొట్టుకున్నాడు.

బాలానగర్‌కు చెందిన మస్కూరి మాధవికి పేటిఎం కెవైసి అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్, ఫోన్ చేయడంతో క్విక్ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకుని సైబర్ నేరస్థులు చెప్పినట్లు రూ.10 వారికి పంపించింది. కొద్ది సమయం తర్వాత వారు బాధితురాలి ఖాతాను హ్యాక్ చేసి రూ.69,000ను విత్‌డ్రా చేశారు. ఈ విధంగా పెటిఎం యప్ వాడుతున్న వారిని లక్షంగా చేసుకుని సైబర్ నేరస్థులు దోపిడీ చేస్తున్నారు. కెవైసిని అప్‌డేట్ చేసుకునేందుకు ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్ యాప్‌లను డౌన్‌లో చేసుకోమని చెబుతున్నారు.

వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నామినల్‌గా రూ.100 పంపించమని చెబుతారు, దీనిని నమ్మి డబ్బులు పంపించిన వారి ఖాతలను హ్యాక్ చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండేళ్ల కోసారి కెవైసి అప్‌డేట్ చేస్తుంది దానికి బ్యాంక్‌కు వచ్చి ఫొటో, గుర్తింపు కార్డులు ఇచ్చి వెళ్లాలని ఫోన్ చేసి చెబుతారు. దానిని ఖాతాదారుడు స్వయంగా బ్యాం క్‌కు వెళ్లి గుర్తింపు కార్డుపై ఖాతా నంబర్, ఫో టోను ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బ్యాంక్‌కు సంబంధించిన అధికారులు అప్‌డేట్ చేసుకోమని అడుగరు. ఈ విషయం తెలియని బాధితులు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేస్తూ లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News