2022లో 15000కు పైగా!
హైదరాబాద్: తెలంగాణలో సైబర్ నేరాలు 2021లో 10303 కాగా, 2022లో 15217కు పెరిగాయి. న్యూఢిల్లీలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా ఏర్పాటుచేసిన ‘సైబర్ సెక్యూరిటీ2023’ అనే ఆన్‌లైన్ సమావేశం సందర్భంగా తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) అంజనీ కుమార్ ఈ విషయాలు వెల్లడించారు.
‘నేషనల్ ఆర్కిటెక్చర్ ఫర్ సైబర్ స్పేస్ మేనేజ్‌మెంట్ ’మీద ఆయన మాట్లాడుతూ ‘సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ప్రపంచమంతటా అవి జరుగుతున్నాయి.సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనడానికే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టిసిఎస్‌బి)ని ఏర్పాటుచేయడం జరిగింది. ఈ బ్యూరోలో 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగింది’ అని తెలిపారు.
పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఆయన వివరిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ నేర పరిశోధక బృందం ఉందన్నారు. ఇప్పటి వరకు వివిధ ఆర్థిక మోసాలలో రూ. 65 కోట్ల వరకు తిరిగా స్వాధీనం చేసుకున్నామన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కలిగి ఉన్న ఆరు పోలీసు కమిషనరేట్లు కాక తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టిసిఎస్‌బి)ని ఏర్పాటు చేశామన్నారు.