Tuesday, September 17, 2024

సైబర్ నేరాలకు అడ్డుకట్ట లేదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు రూ. 8.6 కోట్లు మోసపోయిన సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. సైబర్ నేరస్థులు ఓ వృద్ధుడి నుంచి ఏకం గా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట వచ్చిన మెసేజ్ నమ్మి పెట్టుబడి పెట్టి చివరకు మోసపోయాడు. షేర్లలో పెట్టుబడికి మొదట లాభాలు చూపించిన మోసగాళ్లు. వాటిని ఉపసంహరించుకోడానికి అవకాశం కల్పించారు.

దీంతో బాధితుడు సైబర్ నేరస్థులను పూర్తిగా నమ్మి ఏకంగా రూ.13.26 కోట్లను బదిలీ చేశాడు. ఆ తరువాత ఈ మోసాన్ని గ్రహించాడు. ఇదంతా కొంతమంది వ్యక్తుల కుమ్మక్కుతో ఒక నెట్‌వర్క్‌లా జరిగింది. అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం జరిగింది. దిబ్రూఘర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు జల్సాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించుకోడానికి అడ్డుదారులు తొక్కారు. ట్రేడింగ్ స్కాం చేయాలని పథకం పన్నారు. 60 రోజుల్లోగా తమ పెట్టుబడులపై 30శాతం రాబడికి హామీ ఇస్తూ పెట్టుబడిదారులను ప్రలోభపెట్టారు. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోని ప్రజల నుంచి రూ. 2,200 కోట్లు కాజేశారు. ఈ డబ్బుతో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకరు పెట్టుబడి పెట్టగా, మరొకరు అస్సామీ సినిమాల్లో పెట్టుబడి పెట్టి విలాసవంతమైన జీవితాలను గడిపారు.

చివరకు పోలీస్‌లకు చిక్కారు. ఇలాంటి సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్‌లో ముఖ్యమంత్రులు, మంత్రు లు, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు గుంజుతున్నారు. చాలావరకు ఈ నేరాలు సామాజిక మాధ్యమాల ద్వారానే జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు, కొన్ని ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చన్న దురాశే ఈ నేరాలకు దారి తీస్తోంది. సాధారణంగా మనకు తెలియని విషయం ఏదైనా ఉందంటే దానిపై ఆసక్తితో తెలిసిన వారి సూచనలు తీసుకుంటాం. ముఖ్యంగా పెట్టుబడి వంటి ఆర్థిక సంబంధిత విషయాలైతే కచ్చితంగా అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుంటాం. ఈ పరిస్థితినే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మనకు పెట్టుబడుల్లో సాయం చేస్తున్నట్టు నటించి మన సొమ్ము కాజేస్తున్నారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉచిత స్టాక్ చిట్కాలు, సలహాలపై ప్రకటనలు విడుదల చేసి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటారు. వివిధ క్లయింట్లు సంపాదించిన లాభాల తాలూకు నకిలీ స్క్రీన్ షాట్‌లను విడుదల చేసి నమ్మిస్తుంటారు.

పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితులైతే ఆపరేటర్లు మొదట్లో డబ్బును మోసపూరిత వ్యక్తి తాలూకు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ విధంగా నమ్మించి తమ ప్రీమియం, విఐపి ఛానెళ్లకు సభ్యత్వాన్ని పొందాలని ఒత్తిడి చేస్తారు. తద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు వస్తాయని హామీ ఇస్తుంటారు. బాధితులు ఒకసారి ప్రలోభాలకు గురైన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నిధులను బదిలీ చేయాలని అడుగుతుంటారు. వెబ్‌సైట్‌లో ప్రదర్శించే నకిలీ లాభాలను ఉపసంహరించుకోడానికి పెట్టుబడిదారులు ప్రయత్నించినప్పుడు, ఉపసంహరణ ఎంపిక బ్లాక్ చేయడంతో వారు షాక్‌కు గురవుతారు. ఎంపికను అన్‌బ్లాక్ చేయడానికి స్కామ్‌స్టర్లు పన్నులు,పెనాల్టీలతో సహా వివిధ కారణాలను పేర్కొంటూ తదుపరి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారు. భారీగా మొత్తాన్ని సేకరించిన తరువాత స్కామ్‌స్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంటారు.

అంతేకాదు సైబర్ నేరగాళ్లు బెదిరింపులు కూడా చేస్తుంటారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అయిందని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని, వాట్సాప్‌లో హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆ నేరంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా అదే పనిగా బెదిరిస్తుంటారు. తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పేరునే ఉపయోగించి తాను సిజెఐని అని క్యాబ్ కోసం తనకు రూ. 500 పంపాలని హెచ్చరిస్తూ మెసేజ్ కూడా వచ్చింది. ఈ విధంగా వివిధ రకాలుగా ఈ ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ నేరాలు సాగుతున్నాయి. ఇలాంటి కేసులు పెరిగిపోతుండడంతో హైదరాబాద్‌లోని క్రైమ్స్ అండ్ సిట్ అధికారులు కొన్ని హెచ్చరికలను చేశారు.

‘మార్కెట్ రెగ్యులేటరీ సెబీలో రిజిస్టర్ చేసినవి కాకుండా తెలియని అప్లికేషన్లలో స్టాక్ మార్కెట్ చేయవద్దు. అలాగే అవతలి వ్యక్తుల మాటలను నమ్మి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయరాదు. మోసగాళ్లు అందించే సందేహాస్పదమైన రాబడిని నమ్మవద్దు. మీ డిమ్యాట్ ఖాతా ఆధారాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. గూగుల్ ప్లేస్టోర్ లేదా వారి స్వంత వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్ల ప్రామాణికత నిర్ధారించుకోవాలి’ అని క్రైమ్ విభాగం హెచ్చరికలు చేసింది. ఈ విషయంలో సెబీ యంత్రాంగం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం చాలా అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News