Monday, December 23, 2024

లైక్ కొట్టారో ఖాతా ఖాళీ

- Advertisement -
- Advertisement -

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నయాదందా
మొదట కొంత డబ్బులు ఇచ్చి.. ఆ తరువాత దోచుకుంటున్న సైబర్‌నేరగాళ్లు
అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లకు సమాధానం ఇవ్వొద్దు
ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త
పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరిక

మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని వదులకోవటం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్నారు. ఇది వరకు వివిధ బ్యాంకుల అధికారులమంటూ బురిడీ కొట్టించిన వీరు ప్రజలకు వాటిపై పూర్తిగా అవగాహన రావడంతో కొత్త పంథాను ఎంచుకున్నారు.

ఈ నేపథ్యంలో మొన్న నగరంలో ఫ్రీ వైఫైని ఓ షాపింగ్ మాల్ లో వినియోగించుకున్న ఓ విద్యార్థి తన ఖాతాల నుంచి రూ.60వేలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించగా ఇప్పుడు లైక్‌లు, రివ్యూల పేరుతో సైబర్‌నేరగాళ్లు దోపిడీ వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకొని వారిని టార్గెట్ చేసుకుంటూ దోచుకుంటున్నారు. మీకు ఏ ఉద్యోగం లేకపోయినాఇంటి వద్దే నుంచే రూ.20వేల నుంచి రూ. 30 వేల వరకు సంపాదించవచ్చునని ఎర వేస్తున్నారు.

దీనిలోభాగంగా లైక్‌లు, రివ్యూల పేరుతో మొదట మంచిగా మా ట్లాడి కొంత నగదు వారి వ్యాలెట్ రూపంలో జమ చేస్తూ ఆ తరువాత పెద్దమొత్తంలో ఇంకా డబ్బులు కావాలంటే మేము చెప్పే లింకులను ఓపెన్ చేయాలని తదితర వివరాలు తెలుసుకుని నిండా ముంచుతున్నారు. దీంతో సైబర్‌గాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వారు ఇచ్చిన మొబైల్ నెంబర్లకు ఫోన్లు చేయగా స్విచ్ఛాప్ వస్తుంది. దీంతో చేసేది ఏమీ లేక పోలీసులను సంప్రదిస్తున్నారు. నగరంలో ఈ మధ్యకాలం లో సైబర్ నేరగాళ్లు సామాజిక మధ్యమాల్లో వచ్చే వీడియోలకు ఒక్క లైక్ చేస్తే రూ.5 నుంచి రూ.10ల వరకు ఇస్తామని మొదట డబ్బులు ఇస్తున్నారు. దానికి ఆశపడిన వారు తరువాత సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడిన తరువాత వారు చెప్పినట్లు చేసి లక్షల్లో మునుగుతున్నారు.

ఇలా నగరంలో చాలా మంది బాధితులు మూడు కమిషనర్లరేట్లలో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా యూ ట్యూబ్, సినిమాలకు రివ్యూలు చెప్పే రూ. 7ల నుంచిరూ. 9వే వరకు ఇస్తామని నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. దీనిని నమ్మిన అల్వాల్‌లోని ఓ బాధితులు కొన్ని వీడియోలకు రివ్యూలు చెప్పి రూ. 19వేలు సంపాదించిన తరువాత సైబర్‌నేరగాళ్లు పలు రకాల లింకులు పంపి అతని ఖాతాల్లోని డబ్బులు ఖాజేశారు.

దీంతో జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. అదే విధంగా మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైతం కూడా రివ్యూల పేరుతో కొంత డబ్బులు సంపాదించి రూ. 2ల లక్షల వరకు మోసపోయాడు. ఇలా నగరంలోని మూడు కమిషనర్లరేట్ల నుంచి పదుల సంఖ్యలో ఫిర్యాదు రావటంలో పోలీసులు వారిపైనిఘా పెంచి పలు సూచనలు చేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఎవరి ఎరలో పడవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లకు రిప్లే ఇవ్వవద్దని సూచిస్తున్నారు. సైబర్‌నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టడానికి ఆన్‌లైన్లే వారి వేదిక అని అందుకే ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మనం లింకును ఓపెన్ చేస్తే మన ఫోన్‌లోని డేటా మొత్తం వారికి వెళ్లిపోతుందని దీని ద్వారా మన ఆర్థిక లావాదేవీలు మొత్తం వారికి తెలిసిపోయి వారు ఈజీగా మన బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బులు దోచుకునేందుకు అవకాశం ఉందని సూచిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News