సిటిబ్యూరోః ఎలక్ట్రిక్ కుర్చీని విక్రయించేందుకు యత్నించిన నిమ్స్ వైద్యుడికి సైబర్ నేరస్థులు కుచ్చుటోపి పెట్టారు. కొనుగోలు చేస్తామని చెప్పి వైద్యుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు దోచుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం….నిమ్స్‌లో పని చేస్తున్న సీనియర్ రెసిడెంట్ వైద్యుడు తన వద్ద ఉన్న ఎలక్ట్రిక్ కుర్చీని ఓఎల్‌ఎక్స్‌లో విక్రయానికి పెట్టాడు. దానిని చూసిన సైబర్ నేరస్థుడు వైద్యుడికి ఫోన్ చేశాడు. తన పేరు జితేంద్ర శర్మ అని కూకట్‌పల్లిలో తనకు ఫర్నీచర్ షాప్ ఉందని చెప్పాడు. ఎలక్ట్రిక్ కూర్చీ కొనుగోలు చేస్తానని చెప్పాడు.
తాను డబ్బులు పంపించాలంటే తను పంపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని చెప్పాడు. స్కాన్ చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తాయని చెప్పాడు. దీనిని నమ్మిన వైద్యుడు సైబర్ నిందితుడు చెప్పినట్లు చేశాడు. అతడు పంపించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు. దీంతో వైద్యుడు బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2.58లక్షలు సైబర్ నేరస్థుడి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన వైద్యుడు తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.