Monday, December 23, 2024

కొంప ముంచుతున్న అత్యాశ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, స్టాక్‌మార్కెట్‌పై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా సంప్రదించిన వారికి మయమాటలు చెప్పి పెట్టుబడిపెట్టించి మోసం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడిపెట్టించి నిండా ముంచుతున్నారు నేరస్థులు. గతంలో సైబర్ నేరస్థులు స్టాక్‌మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకునే వారు, ఇటీవలి కాలంలో నేరుగా పెట్టుబడిపెట్టే వారిని కూడా టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టాటా క్యాపిట్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు.

వృద్ధులు టాటా క్యాపిటల్‌లో పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తి చూపిగా వారికి మాయమాటలు చెప్పి వేరే కంపెనీలో పెట్టుబడిగా పెట్టించి తనకు రావాల్సిన లక్షలాది రూపాయల కమీషన్ తీసుకుని జారుకున్నాడు. నిందితుడి మాటలు నమ్మిన వృద్ధులు మూడు అనామక కంపెనీల్లో రూ.3,56,74,000 పెట్టుబడిపెట్టారు. ఏడాదికి 12శాతం లాభాలు వస్తాయని చెప్పడంతో వారు నిందితుడి మాటలు నమ్మారు. కాని పెట్టుబడి పెట్టి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు. తాము పెట్టిన పెట్టుబడి రూ.36,94,989 కావడంతో తమ డబ్బులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి మాత్రం కమీషన్ రూపంలో 47,48,000 వచ్చింది. మరో కేసులో విల్లా పేరుతో మోసం చేసి రెండు కోట్ల రూపాయలు కొట్టేశారు నిందితులు. ఈ కేసులో ఒకే కంపెనీలో పనిచేస్తున్న వారిని నిండాముంచారు. విల్లాల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయని, వాటికి డబ్బులు అవసరం ఉందని, డబ్బులు ఇస్తే తిరిగి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రూ.2కోట్లు తీసుకుని నిండాముంచారు.

రెండు కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా సైబర్‌నేరస్థుల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే వారిని టార్గెట్‌గా చేసుకుని మోసం చేశారు. తాము చెప్పిన కంపెనీలో పెట్టుబడిపెడితే అధికంగా లాభాలు వస్తాయని చెప్పి వాట్సాప్, టెలీగ్రాంలో సైబర్ నేరస్థులు మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాటిని చూసి ఆకర్షితులైన వారిని ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన బానోతు కిరణ్‌కుమార్‌కు పశ్చిమబెంగాల్‌కు చెందిన నిందితులు పెట్టుబడికి చెందిన లింక్ పంపించాడు. దానిని క్లిక్ చేసిన బాధితుడు నిందితులతో మాట్లాడాడు. ఆన్‌లైన్‌లో రూ.86లక్షలు పంపిస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత లాభాలతో కలిపి వాటిని తీసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు డబ్బులు ఆన్‌లైన్‌లో నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు పంపించాడు. కొద్ది రోజులకు మీకు భారీగా లాభాలు వచ్చాయని ఆన్‌లైన్‌లో నిందితులు చూపించారు.

దానిని విత్‌డ్రా చేసేందుకు బాధితుడు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. నిందితులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇలాంటి నేరాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నేపాల్ దేశానికి చెందిన నిందితులు సిలిగురిలో ఉంటూ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పలువురు బాధితుల నంబర్లు తీసుకుని ఫోన్లు చేస్తున్నారు. వీరి మాటలను నమ్మిన వారు నిండామునుగుతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధురాలికి ముంబైకి చెందిన నిందితులు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టారు. తమ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దానిని నమ్మిన బాధితురాలు వారికి రూ.5కోట్లు ఇచ్చింది. వాటిని తీసుకున్న నిందితులు కొద్ది రోజులు లాభాలు వచ్చాయని చూపించారు. తర్వాత కొద్ది కాలానికి బాధితురాలికి తెలియకుండానే షేర్లను విక్రయించారు. నిందితులు ఏకంగా వారు నిర్వహిస్తున్న ఆఫీస్‌ను కూడా ఖాళీ చేసి వెళ్లి పోయారు.

బాధితురాలు ఫోన్ చేసినా నిందితులు స్పందిచడం మానివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన యువకుడికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి మెసేజ్ పంపించాడు. దీనిని నమ్మిన యువకుడు తాను డబ్బులు పెట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టించాడు. బాధితుడి నుంచి సైబర్ నేరస్థులు రూ.16లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేశారు. దీంతో యువకులు నిండా మునిగారు, నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అధికంగా ఆశపడితే….
చాలా కేసుల్లో బాధితుల అత్యాశ వల్లే నేరస్థుల బారిన పడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడిపై లాభాలు రావాలంటే చాలా కాలం వేచి ఉండాలని, కానీ చాలా మంది పెట్టుబడి దారులు తక్కువ సమయంలో అధికంగా లాభాలు రావాలని ఆశపడడంతో నేరస్థుల చేతుల్లో పడి మోసపోతున్నారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడిపెట్టు ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని పెట్టాలి. ఇలా చేయకుండా ఆన్‌లైన్‌లో పరిచయమైన వారు, ముక్కుమోహం తెలియని వారి మాటలు నమ్మి పెట్టుబడి పెడితే లాభాల మాట దేవుడెరుగు ఉన్న డబ్బులు కోట్లాది రూపాయలు నేరస్థులు చేతుల్లో పెడుతున్నారు. ఇలా అత్యాశకు పోయిన వారు నిండిముగునుగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News