Friday, December 20, 2024

అధిక వడ్డీ పేరుతో దోచుకుంటున్న సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు సంప్రదాయ పద్ధతులను మార్చి లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవలి కాలంలో ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న ఎఫ్‌ఐఆర్‌లు. గతంలో సైబర్ నేరస్థులు ఓటిపి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఎక్స్‌పైరీ పేరుతో ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుని బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను దోచుకునేవారు. వీటి పట్ల పోలీసులు విస్కృతంగా ప్రచారం నిర్వహిస్తుండడంతో బాధితులకు అవగాహన వచ్చింది. సైబర్ నేరస్థులు ఫోన్లు చేసి వీటి గురించి అడిగితే అప్రమత్తమై వివరాలు చెప్పడంలేదు. దీంతో తమ పాత పద్దతులకు సైబర్ నేరస్థులు చెక్‌పెట్టారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో దానిని ఉపయోగించుకుంటున్నారు సైబర్ నేరస్థులు, వాట్సాప్, టెలీగ్రాం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో పెట్టుబడుల గురించి విస్కృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెట్టుబడిపెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు.

వాటి పట్ల ఆకర్శితులు అయిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని నిండాముంచుతున్నారు సైబర్ నేరస్థులు. అంతేకాకుండా మరికొంతమందిని చేర్పిస్తే ఎక్కువగా కమీషన్ ఇస్తామని ఆశ పెట్టడంతో కొందరు బాధితులు తాము పెట్టుబడిపెట్టడమే కాకుండా తన స్నేహితులు, బంధువులతో పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఇలా లక్షలాది రూపాయలు బాధితులు పెట్టుబడిగా పెడుతున్నారు. సైబర్ నేరస్థులు వాటిని కొద్ది రోజుల్లోనే మీరు భారీగా డబ్బులు పొందారని ఆన్‌లైన్ ఖాతాల్లో వర్చువల్‌గా చూపిస్తున్నారు. ఇలాగే ఉంచితే డబ్బులు డబుల్ అవుతాయని నమ్మిస్తున్నారు. దీనిని నమ్మిన చాలామంది బాధితులు డబ్బులను డ్రా చేయకుండా అలాగే ఉంచి నిండామునుగుతున్నారు. విత్‌డ్రా చేసేందుకు సైబర్ నేరస్థులను సంప్రదించేందుకు యత్నిస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తోంది. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించి పోలీసుల వద్దకు పరుగుతీస్తున్నారు. కానీ అప్పటికే సమయం మించి పోవడంతో బాధితులు నిండా మునుగుతున్నారు.

జోరుగా నేరాలు….
పెట్టుబడి పేరుతో ఆన్‌లైన్ వేదికగా ఇటీవలి కాలంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 100కు పైగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఇందులో సకాలంలో ఫిర్యాదు చేసిన వారికి పోలీసులు వెంటనే పేమెంట్ గేట్ వే ఆపివేస్తున్నారు. ఇలా పేమెంట్ గేట్‌వే ఆపడం వల్ల కొందరికి డబ్బులు తిరిగి వస్తున్నాయి. ఇలా గేట్ వే ఆపి డబ్బులు పోకుండా చేసిన బాధితులకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రూ.2కోట్లుకుపైగా బాధితులకు అందజేశారు. ఇందులో ఓ బాధితురాలు అధిక వడ్డీకి ఆశపడి రూ.12లక్షలు పెట్టుబడిపెట్టగా ఆమెకు మొత్తం డబ్బులు తిరిగి వచ్చేలా చేశారు పోలీసులు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా ఇస్తారని, ఇది ఆచరణ సాధ్యం కాదని గ్రహించాలని పోలీసులు చెబుతున్నారు. డబ్బులు వస్తున్నాయని చెప్పి అత్యాశకు పోతే ఉన్న డబ్బులు సైబర్ నేరస్థుల చేతుల్లో పెట్టిన వారిమి అవుతామని చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News