Monday, December 23, 2024

క్యూఆర్ కోడ్‌తో సైబర్ నేరస్థుల దోపిడీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తమ వద్ద ఉన్న ఖరీదైన వస్తువులు విక్రయించాలనుకునే వారిని సైబర్ నేరస్థులు నిండా ముంచుతున్నారు. క్యూ ఆర్ కోడ్, ఓటిపి, మెసేజ్‌లకు స్పందించ వద్దని పోలీసులు ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా జనాలు మారడంలేదు. వాటికి స్పందించి బ్యాంక్ ఖాతాల్లోని లక్షలాది రూపాయలను సైబర్ నేరస్థులకు సమర్పించుకుంటున్నారు. సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోతున్నవారిలో ఎక్కువగా చదువుకున్న వారే ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్లర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉంటున్నారు. నిమ్స్‌లో సీనియర్ వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన వద్ద ఉన్న ఎలక్ట్రిక్ కారును విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు. దానిని చూసిన సైబర్ నేరస్థుడు తాను కూకట్‌పల్లిలో ఫర్నీఛర్ వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. మీ ఎలక్ట్రిక్ చైర్‌ను కొనుగోలు చేస్తానని డబ్బులు మాత్రం ఆన్‌లైన్‌లో పంపిస్తానని చెప్పాడు.

దీనిని నమ్మిన వైద్యుడు సైబర్ నేరస్థుడు చెప్పినట్లు చేశాడు, తాను క్యూఆర్ కోడ్ పంపిస్తానని దానిని స్కాన్ చేయాలని దీంతో మీకు డబ్బులు వస్తాయని చెప్పాడు. ఇది నమ్మిన వైద్యుడు సైబర్ నిందితుడు పంపించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు. అంతే వైద్యడి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2.70లక్షలు నిందితుడి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే సైబరాబాద్‌కు చెందని ఇద్దరు బాధితులను రాజస్థాన్‌కు చెందిన ఈ సైబర్ ముఠా ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్, క్వికర్‌ను వేదికగా చేసుకుని దోచుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లికి చెందిన బాధితురాలు ఈ నెల 17వ తేదీన తన ఇంట్లోని సోఫాను రూ.23,500కు విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టింది. దీనిని చూసిన సైబర్ నేరస్థులు వినోద్ పేరుతో ఫోన్ చేసి సోఫాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. కానీ డబ్బులు ఆన్‌లైన్ ద్వారా పంపిస్తామని చెప్పాడు.

తాము క్యూఆర్ కోడ్ పంపిస్తామని దానిని స్కాన్ చేసి రూ.1 పంపిస్తే మిగతా డబ్బులు పంపిస్తామని చెప్పాడు. దానిని నిజమని నమ్మిన బాధితురాలు తన ఎస్‌బిఐ ఖాతాకు క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసింది. ఇలా పలుసార్లు చేయడంతో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.99,500 నిందితుడి బ్యాంక్ ఖాతాకు వెళ్లిపోయాయి. సుచిత్రకు చెందిన మరో బాధితురాలు గత ఏడాది డిసెంబర్ 31,2020న తన వద్ద ఉన్న డ్రెస్సింగ్ టేబుల్‌ను విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టింది, రూ.3,500కు విక్రయించనున్నట్లు పేర్కొంది. సైబర్ నిందితుడు ప్రవీణ్‌కుమార్ పేరుతో ఫోన్ చేసి కొనుగోలు చేస్తానని, డబ్బులు ఆన్‌లైన్‌లో పంపిస్తానని తాను పంపించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో అలాగే చేసింది. దీంతో బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి రూ.57,000 నిందితుడి బ్యాంక్ ఖాతాకు వెళ్లిపోయాయి. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా అమ్మకాలు, కొనుగోలు పేరుతో పలువురు అమాయకులను మోసం చేస్తున్నారు. బాధితులకు క్యూఆర్ కోడ్ పంపిస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను కొట్టేస్తున్నారు.

ఫేస్‌బుక్, ఓఎల్‌ఎక్స్ వేధికగా…
రాజస్థాన్‌కు చెందిన సైబర్ క్రైం నేరస్థులు ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్, క్వికర్ వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని నేరాలు చేస్తున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. వస్తువులు కొనుగోలు చేస్తామని లేదా తక్కువ ధరకు విక్రయిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. అంతేకాకుండా బాధితుల నంబర్లు తీసుకుని వాటితో ఛాటింగ్ చేస్తున్నారు. దీనిని నిజమని నమ్మిన బాధితులు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిందితులు రూ.1 లేదా రూ.5 ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరడంతో నిజమని నమ్మి మోసపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News